
న్యూఢిల్లీ: 'తన కోపమే తనకు శత్రువు'అనే మాట హైదరాబాద్ స్టార్ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడికి ఇప్పటి తెలిసొచ్చినట్టు లేదు. మైదానంలో అనవసర గొడవలతో కెరీర్‌నే నాశనం చేసుకున్న రాయుడు.. చివరి దశకు చేరుకున్నా మారలేదు. తాజాగా ఓ యువ ఆటగాడితో గొడవపడి మరోసారి వార్తల్లో నిలిచాడు. తప్పెవరిదో తెలియదు కానీ.. గొడవలో రాయుడు ఉన్నాడని తెలియగానే అభిమానులు అతన్నే తప్పుబడుతున్నారు.
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. కెప్టెన్‌గా ఆ జట్టును నడిపిస్తున్నాడు.
అయితే ఈ టోర్నీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్‌తో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు చొరవ తీసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడదీసాడు.
అంబటి రాయుడు ఇలా మైదానాల్లో గొడవపడటం ఇదేమీ తొలిసారి కాదు. ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా తదితరులతో గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. మైదానంలోనే కాదు వెలుపల కూడా ఉప్పల్ స్టేడియంలో అతను ఓ వృద్దుడితో తీవ్ర స్థాయిలో గొడవపడి అప్పట్లో వార్తల్లో నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాటర్ షెల్డన్ జాక్సన్ అప్పుడే క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌కి సిద్ధమయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్నాడు. దాంతో బరోడా టీమ్ కెప్టెన్ అయిన అంబటి రాయుడు ఆవేశంగా అతడ్ని ప్రశ్నిస్తూ కనిపించాడు. మరోవైపు నుంచి షెల్డన్ కూడా నోరు జారడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గ్రహించిన ఫీల్డ్ అంపైర్లు ఇద్దరికీ సర్దిచెప్పారు. అంపైర్ల సర్దిచెప్పగానే జాక్సన్ వెనక్కి తగ్గినా.. రాయుడు మాత్రం అలానే వాదిస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. అయితే విష్ణు సోలంకి హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బరోడా టీమ్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని సౌరాష్ట్ర టీమ్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
కెరీర్ ప్రారంభంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌తో గొడవపడి కెరీర్‌నే నాశనం చేసుకున్నాడు. ఆవేశంలో గల్లాలు పట్టుకొని కొట్టుకోగా.. శివలాల్ యాదవ్ రాయుడిపై కన్నెర్ర చేశాడు. దాంతో స్టార్ క్రికెటర్‌గా ఎదగాల్సిన రాయుడు చివరకు ఐపీఎల్ ప్లేయర్‌గా మాత్రమే మిగిలిపోయాడు.