టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు రావాల్సిన గుర్తింపు రావడం లేదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. అసాధారణ ప్రదర్శనతో అయ్యర్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టు అక్షర్ పటేల్‌తో కలిసి అయ్యర్ ఆదుకున్నాడు. దాంతో టీమిండియా పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. వారి వల్లే ఈ మ్యాచ్‌లో విజయం సాధించామని చెప్పాడు. ఈ మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానెల్‌లో రాబిన్ ఊతప్ప, ఆకాశ్ చోప్రాలతో కలిసి మాట్లాడిన అంబటి రాయుడు.. శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

పట్టించుకోకున్నా..
'శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన జట్టులో నాలుగో నెంబర్ బ్యాటర్ అవసరం ఏంటో తెలియజేస్తోంది. టాపార్డర్ విఫలమైనప్పుడు శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు కఠినంగా మారిన వికెట్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో నాలుగో, ఐదో స్థానంలో ఆడే బ్యాటర్లు చాలా కీలకం. శ్రేయస్ అయ్యర్.. అక్షర్ పటేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. నాలుగో స్థానంలో అయ్యర్ ఛాంపియన్ బ్యాటర్. కానీ అతని గురించి మనం ఎవరం ఎక్కువగా మాట్లాడం. కానీ టీమిండియాపై అతను తీవ్ర ప్రభావం చూపాడు.'అని రాయుడు పేర్కొన్నాడు.
ఒత్తిడిని అధిగమించి..
రాయుడి వ్యాఖ్యలతో ఏకీ భవించిన ఊతప్ప.. అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'తీవ్ర ఒత్తిడిలో అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిని అధిగమిస్తూ అతను ఆడిన తీరు అమోఘం. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఒత్తిడిని అధిగమించేందుకు చేయాల్సింది అయ్యర్ చేశాడు. ప్రస్తుతం అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు.'అని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
రీఎంట్రీ సూపరో సూపర్..
టీమిండియాలోకి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చిన విధానం అద్భుతమని మరో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కొనియాడాడు. 'శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. జట్టు నుంచి తొలగించారు. సర్జరీ చేసుకున్నాడు. ఇన్ని ప్రతికూలతల మధ్య అతను తన ఆటపై ఫోకస్ పెట్టి మళ్లీ భారత్ జట్టులోకి పునరాగమనం చేయడమే కాకుండా పరుగుల మోత మోగిస్తున్నాడు. అయ్యర్ ప్రదర్శనను మనం కొనియాడాల్సిందే'అని చోప్రా పేర్కొన్నాడు.