ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తనకు రెండు కళ్ల లాంటివని టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అన్నాడు. ఈ రెండు జట్లలో ఏది ఎక్కువ ఇష్టమంటే చెప్పడం కష్టమని తెలిపాడు. ఈ రెండు టీమ్స్ తనకు రెండు ఫ్యామిలీస్ లాంటివని చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టు తనకు అమ్మమ్మ టీమ్ అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ నానమ్మ జట్టు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా తెలుగు కామెంట్రీ బాక్స్‌లో ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలో ఏ జట్టును ఫ్యామిలీగా భావిస్తారు? అని అంబటి రాయుడిని #Starniadugu లో ఓ అభిమాని ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రెండు జట్లు నాకు ఫ్యామిలీలాంటివే. ప్రతీ ఇంట్లో అమ్మవైపు ఫ్యామిలీ.. నాన్నవైపు కుటుంబం ఉంటుంది. నాకు క్రికెటర్‌గా జన్మనిచ్చింది ముంబై ఇండియన్స్. కాబట్టి ఆ జట్టు నాకు అమ్మమ్మగారి ఫ్యామిలీ లాంటిది. కెరీర్‌లో చివరి వరకు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్‌లో కాబట్టి ఆ జట్టు నాన్నగారి సైడ్ ఫ్యామిలీ లాంటిది. ఈ రెండు జట్లు నాకు ఫ్యామిలీలే'అని అంబటి రాయుడు నవ్వుతూ చెప్పాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్‌వేదికగా అభిమానులతో పంచుకోగా.. వైరల్‌గా మారింది. 'వారెవ్వా రాయుడు ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(2/24), మతీష పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్)తో పాటు శివమ్ దూబే(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), రచిన్ రవీంద్ర(22 బంతుల్లో 5 ఫోర్లతో 37), అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(2/18) రెండు వికెట్లు తీయగా.. దిగ్వేజ్ రతి, ఆవేశ్ ఖాన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు. సీఎస్‌కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోనీ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.