చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో సీజన్ ఆడాలని ఆ జట్టు మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అన్నాడు. ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌ను తాను ఒప్పుకోనని, అతను ఇలా వెనుదిరగడం తనకు నచ్చడం లేదని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేను ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోనీ ఆఖరి వరకు కష్టపడ్డాడు.

యశ్ దయాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ.. ప్రత్యర్థి ఆటగాళ్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగెత్తాడు. ఓటమి బాధను తట్టుకోలేకనే ధోనీ అలా చేశాడనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ సీజన్‌లో చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగే ఫైనల్లో ఆడి ఘనంగా ఆటకు వీడ్కోలు పలకాలని ధోనీ భావించాడు. కానీ ఆర్‌సీబీ అతని ఆశలపై నీళ్లు చల్లింది. సీఎస్‌కే పరాజయంతో తీవ్ర భావోద్వేగానికి గురైన అంబటి రాయుడు.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. చేతులు అడ్డు పెట్టుకొని ముఖం దాచుకున్నాడు.
అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన రాయుడు.. ధోనీ మరో సీజన్ ఆడాలని సూచించాడు. 'ధోనీ మరో సీజన్ ఆడాలి. ఇది ఏ మాత్రం అతని చివరి మ్యాచ్ కాకూడదు. ఇలా అతను ఆటకు వీడ్కోలు పలకడం బాలేదు. వచ్చే సీజన్ ఆడి ఐపీఎల్ టైటిల్ గెలవాలి. ధోనీలాంటి ఆటగాడు, మనిషి.. తరానికి ఒక్కరు ఉంటారు.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.
రిటైర్మెంట్‌కు సంబంధించి ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కూడా స్పందించలేదు. కానీ అతని వయసు రీత్యా అతను వచ్చే సీజన్ ఆడటం కష్టంగా కనిపిస్తోంది. పైగా అప్‌కమింగ్ సీజన్‌లో మెగా వేలం జరగనుంది. ఒక్క సీజన్ కోసం ధోనీని రిటైన్ చేసుకుంటే సీఎస్‌కే టీమ్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ క్రమంలోనే ధోనీ చివరి మ్యాచ్ ఆడేసాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.