టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్.. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కూడా ఖంగుతిన్నది. ఈ వరుస పరాజయాలతో సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అద్భుతం జరిగితే తప్పా పాకిస్థాన్ ఈ టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి లేదు.
మరికొద్ది సేపట్లో మరో పసికూన కెనడాతో పాక్ తలపడనుంది. సూపర్-8 రేసులో నిలవాలంటే పాక్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే టీమ్ రాజకీయాలు, ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో కెనడాపై పాకిస్థాన్ గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.

జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సైతం పాకిస్థాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'కెనడా చేతిలో కూడా పాకిస్థాన్‌కు ఘోర పరాజయం తప్పదు. పాకిస్థాన్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఏ జట్టు అయినా వారిపై గెలవగలదు. పూర్తి ఆధిపత్యం చెలాయించగలదు. కెనడా కన్నా పాకిస్థాన్ జట్టుకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. కానీ పాక్ బ్యాటింగ్ బలహీనంగా ఉంది.
ఆ జట్టు అటు దూకుడుగా ఆడటం లేదు. ఇటు సమతూకంతో బ్యాటింగ్ చేయడం లేదు. అసలు వాళ్లు ఏ అప్రోచ్‌తో ఆడుతున్నారనే విషయం అర్థం కావడం లేదు. వాళ్లు చాలా భయపడుతున్నారు. ఫోర్స్, సిక్స్‌లు, సింగిల్స్ కొట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ విషయాన్ని వెతుకుతున్నారు.
ఏ బ్యాటర్ కూడా ఆత్మవిశ్వాసంతో కనబడటం లేదు. ఏ బ్యాటర్ అయినా 10 బాల్స్ ఆడి.. ఓ రెండు ఫోర్లు లేదా రెండు సింగిల్స్, రెండు డబుల్స్ తీసి ఔటవుతున్నారు. ఎవరికీ కూడా గేమ్ ప్లాన్ లేదు.
కెనడా పేసర్లు జెరెమీ గోర్డాన్, డిలన్ హైలైర్ బంతులను ఆడటంలో పాక్ బ్యాటర్లు ఇబ్బంది పడుతారు. ఈ ఇద్దరూ పిచ్ హార్డ్, షార్ట్ బాల్స్ వేస్తారు. వీటికి పాక్ బ్యాటర్ల వద్ద సమాధానం లేదు. ఈ ఇద్దరూ పాక్ పతనాన్ని శాసిస్తారు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.