టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తనకు ఉన్న ప్రేమను మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి చాటుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీనే అత్యుత్తమ కెప్టెన్ అని పేర్కొన్నాడు. భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై వివాదాస్పద ట్వీట్ చేసిన అంబటి రాయుడు ఆ తర్వాత ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. 'కన్నుకు కన్ను అంటే ప్రపంచం గుడ్డిదవుతుంది'అని రాయుడు చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత రాయుడు వరుస ట్వీట్స్‌తో ఎంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నంచ చేసినా నెటిజన్లు పట్టించుకోలేదు. రాయుడుపై విమర్శలు గుప్పించారు.
ఆ సమయంలో ఐపీఎల్ 2025 సీజన్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన రాయుడు.. లీగ్ తిరిగి ప్రారంభమైనా వ్యాఖ్యానానికి దూరంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు పెట్టలేదు. కేవలం ఆర్‌సీబీ విజయాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. పూర్తిగా ఇంటికే పరిమితమైన రాయుడు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో సెమీస్ చేరిన యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్.. పాకిస్థాన్‌తో ఆడమని చెప్పి టోర్నీ నుంచి తప్పుకుంది.

ఈ టోర్నీ నుంచి భారత్ తప్పుకోవడంతో రాయుడు మళ్లీ విశ్లేషకుడిగా టీవీ షోలో పాల్గొనడం ప్రారంభించాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో షోలో పాల్గొన్న రాయుడు.. భారత క్రికెట్ చరిత్రలోని టాప్-6 కెప్టెన్లను ఎంపిక చేశాడు. మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ధోనీని అత్యుత్తమ కెప్టెన్‌గా పేర్కొన్న రాయుడు.. రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన రోహిత్ శర్మకు రెండో స్థానం ఇచ్చాడు. భారత క్రికెట్‌లో విప్లవాన్ని తీసుకొచ్చిన సౌరవ్ గంగూలీకి మూడో ర్యాంక్ ఇచ్చిన రాయుడు.. 1983 ప్రపంచకప్ విజేత, దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్‌కు నాలుగో స్థానాన్ని కేటాయించాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని ఐదో స్థానం కేటాయించాడు. టెస్ట్ ఫార్మాట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే కోహ్లీ టాప్-2లో ఉంటాడని చెప్పాడు. మహమ్మద్ అజారుద్దీన్‌కు ఆరో స్థానం కేటాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
విరాట్ కోహ్లీకి ఐదో ర్యాంక్ ఇవ్వడాన్ని అతని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. మరోసారి రాయుడు.. కోహ్లీపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20తో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. దాంతో వన్డేల్లో కూడా అతన్నే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.