ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు వెల్లడించాడు. ఒక సీజన్‌లో ఫెయిర్ ప్లే గురించి తనకు బుద్ది చెప్పిన ధోనీ.. తానే తప్పు చేశాడని గుర్తు చేసుకున్నాడు. ధోనీ తనను రేకుల షెడ్డు అని పిలిచేవాడని తెలిపాడు.
ఇటీవల చీకీ సింగిల్స్ అనే షోలో పాల్గొన్న అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'ధోనీ నన్ను అప్పుడప్పుడు 'టిన్ రూఫ్' (రేకుల షెడ్డు) అని పిలిచేవాడు. ఆ సమయంలో వైడ్ లేదా నో-బాల్‌కు రివ్యూ ఉండేది కాదు. అందుకే వైడ్, నోబాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగేవాళ్లం. ఆ సమయంలో ధోనీ నన్ను మందలించాడు.

'నువ్వు కేలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు. చేతులు ఊపుతూ అనవసరంగా గొడవ పడకు, మనకి ఫెయిర్ ప్లే పాయింట్స్ తగ్గుతాయి.'అని హెచ్చరించాడు. కానీ అదే ఏడాది ధోనీ.. నోబాల్ విషయంలో స్వయంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. నా వల్ల జట్టుకు నష్టం జరగలేదు.'అని అంబటి రాయుడు నవ్వుతూ చెప్పాడు.
సీఎస్‌కే కంటే ముందు అంబటి రాయుడు.. 2009-2017 వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. అయితే 2015 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్, ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలార్డ్.. స్టార్క్ వైపు బ్యాట్ విసిరేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన గురించి ప్రశ్నించగా.. రాయుడు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇలాంటి హీటెడ్ మూమెంట్స్‌లో ఆటగాళ్లుగా ఒకరికొకరం మద్దతుగా ఉంటామని చెప్పాడు.
'ప్రతి విషయంలోనూ నాదే తప్పా? మేమంతా మంచి టీమ్ మేట్స్, కాబట్టి ఒకరికొకరు మద్దతుగా ఉండేవాళ్లం తప్ప పారిపోయేవాళ్లం కాదు. అందరూ ఇలాంటివి చేస్తారు. కానీ దొరికిపోయిన వారిని మాత్రమే చూపిస్తారు'అని రాయుడు పేర్కొన్నాడు.