టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడిని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ ఓ ఆట ఆడుకున్నారు. లైవ్ షోలో.. రాయుడి ద్వంద వైఖరిని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. అంబటి రాయుడు ఓ జోకర్ అంటూ కెవిన్ పీటర్సన్ అతన్ని తీసిపారేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూరోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

ఈ మ్యాచ్ అనంతరం మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, స్టార్ స్పోర్ట్స్ హోస్ట్ మయాంతి లాంగర్‌తో కలిసి మాట్లాడిన రాయుడు.. కేకేఆర్‌ను ప్రశింసిస్తూనే ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్‌గా నిలబెడుతాయని చెబుతూ.. ఈ సీజన్‌లో కోహ్లీ చేసిన 741 పరుగులను తక్కువ చేస్తూ మాట్లాడాడు.
అంతటితో ఆగకుండా ఆర్‌సీబీ టైటిల్ గెలవాలంటే కోహ్లీ తన అత్యుత్తమ ప్రమాణికాలను తగ్గించుకోవాలని, కుర్రాళ్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేసేందుకు తక్కువ పరుగులు చేయాలని సూచించాడు. ఈ వ్యాఖ్యలతో పాటు మ్యాచ్‌కు ముందు ఆరెంజ్ జాకెట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సపోర్ట్ చేసిన రాయుడు.. కేకేఆర్ విజయానంతరం పర్పుల్ కలర్ జాకెట్ ధరించడంతో అతన్ని పీటర్సన్, మాథ్యూ హెడెన్ ఓ ఆట ఆడుకున్నారు.
ఆర్‌సీబీ, కోహ్లీని ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలను, సన్‌రైజర్స్‌కు మద్దతు తెలిపి ఓడిపోవడంతో యూటర్న్ తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాయుడిని ఎగతాళి చేశారు. కెవిన్ పీటర్సన్ అయితే రాయుడిని ఓ జోకర్‌గా అభివర్ణించాడు. లైవ్ టీవీలో ఇద్దరు దిగ్గజాలు పరువు తీస్తుండటంతో రాయుడు ఏం చేయలేకపోయాడు.
'ఈ ఇద్దరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వాళ్లతో కలిసి పని చేయడం భారతీయులకు సెట్ అవ్వదు'అని పేర్కొన్నాడు.