T20 World Cup 2024: అతని కంటే బాగా ఆడేవారు ఎవరు? సెలెక్టర్లపై అంబటి రాయుడు ఫైర్!
టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టులో విధ్వంసకర ఫినిషర్, యువ సంచలనం రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన ఆటగాళ్లలో రింకూ సింగ్‌లా చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి దూకుడుగా ఆడే సామర్థ్యం ఎవరికి ఉందని ప్రశ్నించాడు.
అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గతేడాదిగా భారత టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు అసాధారణ ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్‌ను సెలెక్టర్లు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక చేశారు.

అయితే రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటి రాయుడు ఎక్స్‌వేదికగా సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. క్రికెటింగ్ సెన్స్, సామర్థ్యం కంటే గణంకాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందనే విషయం రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం ద్వారా స్పష్టమైందని తెలిపాడు.
డెత్ ఓవర్లలో పరిస్థితులతో సంబంధం లేకుండా ధాటిగా ఆడగలిగే సామర్థ్యం రింకూ సింగ్‌కు ఉందని, ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో జడేజా మినహా మరే ఆటగాడు కూడా రింకూ సింగ్‌లా ఆడలేదని గుర్తు చేశాడు.

'టీ20 ప్రపంచకప్‌కు రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్, సామర్థ్యం కంటే గణంకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం అర్థమవుతోంది. భారత ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా మినహా ఎవరూ కూడా రింకూ సింగ్‌లా 16, 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి చివరి 2 ఓవర్లను అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయలేదు.
అతన్ని టీమిండియా చాలా మిస్సవుతోంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ కంటే క్రికెటింగ్ సామర్థ్యం చాలా ముఖ్యం.'అని రాయుడు ట్వీట్ చేశాడు.
అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రదర్శనే రింకూ సింగ్‌ను పక్కనపెట్టడానికి కారణమైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ తరఫున రింకూ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలతోనే రింకూ సింగ్‌ను పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది.
అంతేకాకుండా శివమ్ దూబే సూపర్ ప్రదర్శన కూడా రింకూ సింగ్ ఎంపికను అడ్డుకున్నట్లు అర్థమవుతోంది. సీఎస్‌కే తరఫున ఫినిషర్‌గా ఆడుతున్న దూబే సంచలన బ్యాటింగ్‌తో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన శివమ్ దూబేనే సెలెక్టర్లు సరైన ఫినిషర్‌గా భావించి ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications