వైభవ్ కోసం అతన్ని ఎలా తొలగిస్తారు? జర ఓపిక పట్టండి: అంబటి రాయుడు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అండగా నిలిచాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం ప్రపంచకప్ అందించిన ఆటగాడిని ఎలా తొలగిస్తారు? అని ప్రశ్నించాడు. వైభవ్ విషయంలో కాస్త ఓపికతో వ్యవహరించాలని విమర్శకులకు సూచించాడు.
ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఘోర పరాజయం నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు గంభీర్‌పై దుమ్మెత్తిపోసారు.
ఫ్లాట్ వికెట్స్‌కు అలవాటు పడటంతోనే..
తాజాగా ఓ కార్యక్రమంలో ఈ సిరీస్ ఫలితంపై మాట్లాడిన రాయుడు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు అండగా నిలిచాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడకపోవడం వల్లే టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారని వెనకేసుకొచ్చాడు. 'ఈ పరాజయాన్ని నేను అంతగా పట్టించుకోను. ఎందుకంటే ఇంగ్లండ్‌లో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుంది. అక్కడి కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడి వాతావరణానికి కూడా భారత ఆటగాళ్లు అలవాటు పడిపోతారు.

ఐర్లాండ్ తరహా పిచ్‌లు భారత్‌లో ఉండవు. కాబట్టి ఈ ఓటమికి బ్యాటర్లను మాత్రమే నిందించడం అన్యాయం అవుతుంది. ఫ్లాట్ వికెట్స్‌పై అలవాటు పడిన భారత బ్యాటర్లు.. ఐర్లాండ్ కండిషన్స్‌కు తగ్గట్లు తమ ఆటను మార్చుకోలేకపోయారు. ఐర్లాండ్ వికెట్స్‌పై ఆలస్యంగా ఆడాలి. బ్యాట్ స్వింగ్‌ను అదుపులో ఉంచుకోవాలి. ఇలా సర్దుబాటు చేసుకోవడం చాలా కష్టం.
వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వకపోవడం మంచిదే..
టీ20ల్లో సుందర్ బాగానే బౌలింగ్ చేస్తాడు. కానీ అతను బ్యాటింగ్‌లో ఫినిషర్‌గా రాణించలేడు. నాలుగు, ఐదో స్థానంలో ఒక బాధ్యతను మాత్రమే నిర్వర్తించగలడు. ఫినిషర్‌గా రాణించాలంటే స్పిన్, పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలాగే ఒత్తిడి సమయాల్లో నాణ్యమైన బంతులను కూడా బౌండరీలు, సిక్సర్లు కొట్టాలి. ప్రస్తుతానికి ఆ సామర్థ్యం సుందర్‌కు లేదు. భవిష్యుత్తులో అతను ఆ స్థాయికి చేరుకుంటాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అతను తన పాత్రను చక్కగా పోషించగలడు.
వైభవ్ సూర్యవంశీ విషయంలో మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయమే తీసుకుంది. సూర్యవంశీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం, భారత జట్టులో ఆడటానికి ఏం కావాలనే విషయాలను, తన పాత్ర ఏంటనే సూక్ష్మ నైపుణ్యాలను తెలుసుకోవడం ఒక మంచి లెర్నింగ్ కర్వ్. ఈ మ్యాచ్‌ల నుంచి అతను చాలా విషయాలు నేర్చుకుంటాడు. తద్వారా అతనికి అవకాశం వచ్చినప్పుడు మరింత మెరుగ్గా రాణిస్తాడు.
ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తారు..
ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే వారు భారత్ తరఫున బాగా రాణించారు. వారు దేశానికి వరల్డ్ కప్ అందించారు. కాబట్టి, వారిని జట్టులో కొనసాగించాల్సిందే. అదే సమయంలో సూర్యవంశీ కూడా అవకాశం లభిస్తుంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఈ ఓటమిని హ్యాండిల్ చేయగలడు. ఇంగ్లండ్ పరిస్థితులు అతనికి కలిసొస్తాయి. జట్టు కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

