ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ క్రీజులో సెట్ అయితే దూకుడుగా ఆడగలడని కొనియాడాడు. అయితే రాహుల్‌కు ఉన్న ఏకైక సమస్య అతని మైండ్ సెట్టేనని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92)అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడినా.. రాహుల్ బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆరంభంలో చాలా స్లోగా ఆడిన రాహుల్.. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. తొలి 17 బంతుల్లో 20 పరుగులే చేసిన రాహుల్.. ఆ తర్వాత గేర్ మార్చి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో షోలో మాట్లాడిన అంబటి రాయుడు.. అతని బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు.

'ఇన్నింగ్స్ ప్రారంభంలో కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడాడు. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత అద్భుతంగా చెలరేగాడు. బహుశా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతని పాత్ర అదే కావచ్చు. అతను ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేయాలనేది వారి వ్యూహం అనుకుంటా. రాహుల్ ఒక్కసారి క్రీజులో సెట్ అయితే.. ఎలాంటి బంతినైనా బౌండరీకి పంపగల సామర్థ్యం అతనికి ఉంది.
రాహుల్ ప్రత్యేకత కూడా అదే. అతనికి ఉన్న ఏకైక సమస్య మైండ్‌సెట్. ఎందుకంటే స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు ఎలాంటి లెంగ్త్‌లో వేసినా ఎదుర్కొనే సత్తా అతనికి ఉంది. అతను ఏ వ్యూహంతో బ్యాటింగ్‌కు వస్తాడనేదే అసలైన సవాలు. ఈ రోజు అతను ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. ఆ పనిని అతను చాలా అద్భుతంగా చేశాడు. అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడనే విషయాన్ని మర్చిపోవద్దు'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌ను డకౌట్‌తో ప్రారంభించిన రాహుల్.. రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మూడో మ్యాచ్‌లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్‌తో విశ్వరూపం చూపించాడు. గుజరాత్ చేతిలో ఓడినా.. రాహుల్ ఫామ్ అందుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు సానుకూల అంశంగా మారింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండు గెలిచింది. తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 11న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.