హైదరాబాద్: టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో ఉన్న విభేదాల కారణంగానే 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో తనకు చోటు దక్కలేదని మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అన్నారు. ప్రపంచకప్ ఆడకపోవడం తన జీవితంలో అత్యంత నిరాశపరిచే అంశమని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో సీనియర్లతో ఎదురైన భేదాభిప్రాయాలు కెరీర్ మొత్తం వెంటాడాయని చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2023 సీజన్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు చానెల్ నిర్వహించిన చాట్ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిన వన్డే ప్రపంచకప్ టీమ్ నిష్క్రమణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'2019 వన్డే ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడు నేను ఫ్లైట్‌లో ఉన్నాను. అప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే న్యూస్ చూసిన నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. అప్పటికే టీమ్‌లోకి తీసుకోరనే ఇండికేషన్స్ నాకు ఉన్నాయి. నన్ను తప్పించి ఓ ఆల్‌రౌండర్‌ను తీసుకోవడం నన్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.
వన్డే ప్రపంచకప్ ఆడటానికి వెళ్తున్నారా? లేక లీగ్ మ్యాచ్ ఆడేందుకు టీమ్‌ను ఎంపిక చేశారా? అనిపించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు నన్ను సిద్దం చేశారు. నన్ను తప్పించినప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రహానే వంటి ఆటగాళ్లను తీసుకుంటే నేను పెద్దగా ఫీలయ్యేవాడిని కాదు. కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఆల్‌రౌండర్‌ను ఎంచుకోవడం నాకు ఆగ్రహం తెప్పించింది.
త్రీడీ ప్లేయర్ అంటూ ఎమ్మెస్కే చేసిన వ్యాఖ్యలు మరింత అసహనానికి గురి చేశాయి. ఆ కోపంలోనే త్రీడీ గ్లాస్‌లో ఆటను చూస్తానని ట్వీట్ చేశాను. జనాలందరూ విజయ్ శంకర్‌ను ట్రోల్ చేశారు. కానీ నేను అతన్ని, ఎమ్మెస్కేను ఉద్దేశించి ట్వీట్ చేయలేదు. టీమిండియా సెలెక్షన్ తీరుపై సెటైర్లు పేల్చాను. జనాలు ఇది అర్థం చేసుకోలేక విజయ్ శంకర్‌ను తిట్టారు. వాస్తవానికి అతని తప్పేం లేదు. అందరిలా అవకాశం కోసం ఎదురు చూసిన ఓ ప్లేయర్ మాత్రమే.
టీమ్ సెలెక్షన్‌లో ఒక్కరి నిర్ణయమే ఉంటుందని నేను అనుకోను. టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అయితే కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్కే ప్రసాద్‌తో ఉన్న విభేదాలు నాకు నష్టం చేసాయని నేను భావిస్తున్నా. ఎమ్మెస్కే ప్రసాద్ ఒక్కడే కాదు. సీనియర్లతో ఉన్న విభేదాలు నా కెరీర్ మొత్తం వెంటాడాయి.
2005లో ఆంధ్ర జట్టు తరఫున ఆడేందుకు వెళ్లాను. హైదరాబాద్ క్రికెట్‌లో సెక్రటరీ, కోచ్, కెప్టెన్‌లతో ఉన్న ఇబ్బందులతో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆంధ్ర టీమ్ కెప్టెన్‌గా ఎమ్మెస్కే ఉన్నారు. ఆయన వల్ల ఏం ఇబ్బంది కాలేదు. కానీ ఆయన చేసిన పనులు, పద్దతులు నాకు నచ్చలేదు. దాంతో ఏడాదికే మళ్లీ హైదరాబాద్ టీమ్‌లోకి తిరిగి వచ్చాను.
వన్డే ప్రపంచకప్ ముందు న్యూజిలాండ్ పర్యటనలో నెంబర్ 4లో నేను అద్భుతంగా రాణించాను. అలాంటి కండిషన్స్ ఉండే ఇంగ్లండ్‌లో కూడా నేను రాణించగలనని నమ్మాను. కానీ సెలెక్టర్లు నన్ను పక్కనపెట్టినప్పుడు నాలుగో నెంబర్ రిప్లేస్ చేయకుండా ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే చెప్పాలి.'అని అంబటి రాయుడు అన్నారు.