ధర్మశాల: టీమిండియా టెస్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తెలివితేటలను ఇకపై వన్డేల్లో కూడా వినియోగించుకుంటామని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానున్న తరుణంలో శనివారం మీడియాతో మాట్లాడాడు.
'ఇప్పటికే నేను కోహ్లీని ఎక్కువగా వినియోగించుకోవడం మొదలుపెట్టా. మైదానంలో వీలైనంత ఎక్కువగానే విరాట్‌ను సంప్రదించి అతని సూచనలు తీసుకుంటున్నా. కోహ్లీ తెలివితేటలను ఇకపై కూడా వాడుకుంటామ'ని ధోని ఈ సందర్భంగా తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్యూజిలాండ్ తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్ కోసం ధోని తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో న్యూజిలాండ్‌తో ఆరంభం కానున్న తొలి వన్డే జట్టులో తన పాత్ర ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందన్న ధోనీ.. యువ ఆటగాళ్ల చేరికతో బాధ్యత మరింత పెరిగిందని అన్నాడు.
'2004లో నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆటలోలాగానే జట్టులోనూ చాలా మార్పులొచ్చాయి. టీమ్‌లోకి చాలామంది వచ్చి వెళ్లారు. సీనియర్ ఆటగాడైనంత మాత్రాన, కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన జట్టులో మన పాత్రేమీ మారదు. పైగా అదనపు బాధ్యతలు ఉంటాయి. యువకులతో మాట్లాడుతూ వారికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంది' అని అన్నాడు.