బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆటగాళ్లను, స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టేందుకు తాను ఏమైనా హర్మన్‌ప్రీత్ కౌరానా? అని ప్రశ్నించింది. జట్టులోని జూనియర్ ప్లేయర్లను నిగర్ సుల్తానా కొడుతుందని బంగ్లాదేశ్ పేసర్ జహనారా ఆలమ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన నిగర్ సుల్తానా ఈ ఆరోపణలను ఖండించింది. ఈ క్రమంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు ప్రస్తావించింది. దాంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
'ఆటగాళ్లను నేనెందుకు కొడుతాను. వికెట్ స్టంప్స్‌ను ఎందుకు పడేస్తాను. అలా చేయడానికి నేనేమైనా హర్మన్‌ప్రీత్ కౌర్‌నా? నేనేందుకు అలా చేస్తాను? నా వ్యక్తిగత స్థలంలో వంట చేస్తున్నప్పుడో లేదా ఇంకేదైనా చేస్తున్నప్పుడో నా బ్యాట్‌ను అటూ ఇటూ కొట్టవచ్చు. నా హెల్మెట్‌ను కిందపడేయవచ్చు. అది నా సొంత విషయం. కానీ నేను ఇంకొకరిపై చేయి ఎందుకు చేసుకుంటాను. గతంలో నేను ఎప్పుడైనా అలా చేశానని విన్నారా? ఈ విషయంపై మీరు ఇతర ఆటగాళ్లను అడగవచ్చు.

అందరి ముందు నా గురించి జహనారా చెప్పిన తీరు ఏ మాత్రం బాలేదు. నేను ఏ మాత్రం అలాంటి అమ్మాయిని కాదు. జహనారా నాపై ఈ ఆరోపణలు చేసిందని నేను విన్నాను. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆమెకు ఎవరో ఫోన్ చేసి.. నిగర్ సుల్తానా మమ్మల్ని కొట్టి చంపేస్తుంది. మమ్మల్ని రక్షించండి.'అని చెప్పిందంట.
నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే.. ఆరు ఏడేళ్లుగా.. ఇక్కడ లేని ఒక వ్యక్తికి చెప్పేబదులు టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు కదా? జట్టులో నేనే నియంతనా? జట్టులో ఉన్న ప్లేయర్‌కు ఇబ్బందిగా ఉంటే సదరు ప్లేయర్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయకుండా ఆస్ట్రేలియాలో ఉన్న జహనారాకు ఎందుకు చెబుతుంది?
జట్టులో నేనేమీ నియంతను కాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరి స్థానం వారికే ఉంటుంది. అందరిలానే నేను కూడా. కాకపోతే కెప్టెన్‌గా నాకు కొంచెం గౌరవం ఎక్కువగా ఉంటుంది. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అందర్నీ ఒకేలా చూస్తుంది. ఈ తరహా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీని వెనుక ఎవరో ఉన్నారో నాకు తెలుసు. నేను చాలా కాలంగా బంగ్లా కెప్టెన్‌గా కొనసాగుతున్నాను. అందరికి నేను నచ్చాలని లేదు. ఈ తరహా వ్యాఖ్యలను నేను పట్టించుకోను' అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిగర్ సుల్తానా చెప్పుకొచ్చింది.
2023లో బంగ్లాదేశ్ పర్యటనలో హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్ ఇచ్చి ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడేసింది. ఇదే విషయాన్ని నిగర్ సుల్తానా ప్రస్తావించింది.