నేనేం డారెన్ సామీ తొత్తును కాదు.. అల్జారీ జోసెఫ్ ఫైర్! విండీస్ టీమ్‌లో భగ్గుమన్న విభేదాలు!
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీపై ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తానేం డారెన్ సామీ తొత్తును కాదని, వెస్టిండీస్ ఆటగాడినని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కక్షతో తన గురించి అవాస్తవాలు మాట్లాడటం డారెన్ సామీకి తగదని హితవు పలికాడు. తన గురించి అన్నీ తెలిసి కూడా ఎందుకు అసత్యాలు మాట్లాడాడో అర్థం కావడం లేదన్నాడు.
డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌లో భాగంగా సొంతగడ్డపై పాకిస్థాన్‌తో వెస్టిండీస్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సిరీస్‌కు అల్జారీ జోసెఫ్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతోనే అల్జారీ జోసెఫ్ ఈ సిరీస్ ఆడటం లేదని వెస్టిండీ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కానీహెడ్ కోచ్ డారెన్ సామీ మాత్రం భిన్నమైన కారణాన్ని చెప్పాడు. అల్జారీ జోసెఫ్ ఉద్దేశపూర్వకంగానే జట్టు సెలెక్షన్‌కు దూరంగా ఉన్నాడని, పాకిస్థాన్‌తో ఆడటానికి అతను నిరాకరించాడని తెలిపాడు.

సామీపై అల్జారీ జోసెఫ్ ఆగ్రహం..
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాకిస్థాన్ మీడియాతో పాటు అభిమానులు అల్జారీ జోసెఫ్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అల్జారీ జోసెఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సిరీస్‌కు ముందు నేను మా హెడ్ కోచ్‌తో మాట్లాడాను. విండీస్ బోర్డుతో కూడా చర్చించాను. ఆ సమయంలోనే బోర్డు నేను వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యానని ప్రకటించింది.
అన్ని విషయాలు తెలిసి కూడా సామీ అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు. అతని వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో నాకు తెలుసు. నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడటం ఎందుకు? నిజానికి ఈ ఏడాది నేను ఆటకు దూరంగా ఉన్నా. కండరాల నొప్పి కారణంగా నా శరీరం సహకరించడం లేదు.
నేనేం డారెన్ సామీ తొత్తును కాదు
టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు నేను ఏ మాత్రం సిద్దంగా లేను. ఇవన్నీ తెలిసి కూడా సామీ నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇలా సమయం, సందర్భం లేకుండా ఎలా మాట్లాడుతారు? నేను ప్రొఫెషనల్క్రికెట్‌ను. నా పనిని నేను చేసుకుంటా. నేను వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా.నేనేం డారెన్ సామీ తొత్తును కాదు. కాబట్టి ఈ వ్యాఖ్యలతో నాకు ఒరిగేదేం లేదు. అయినా నేనేం జట్టు సభ్యులను స్నేహితులుగా మార్చుకునేందుకు ఆడటం లేదు.
వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఎవర్ని పట్టించుకోకుండా నా బాధ్యతనే నేను నిర్వర్తిస్తాను.'అని అల్జారీ జోసెఫ్ పేర్కొన్నాడు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు వెస్టిండీస్ క్రికెట్‌లోని విభేదాలను బయటపెట్టాయి. వెస్టిండీస్, పాకిస్థాన్ మధ్య రెండో టెస్ట్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

