
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ అలాన్ డొనాల్డ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ అగ్రశ్రేణి జట్టుగా దూసుకుపోతుందన్నాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న కోహ్లీసేన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లార్ట్స్ టెస్ట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఈ విజయంపై స్పందించిన అలాన్ డొనాల్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్ విజయం తర్వాత 6 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ తనతో అన్న మాటలు గుర్తుకువచ్చాయన్నాడు. అప్పుడే భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టడం తన లక్ష్యమని కోహ్లీ తనతో అన్నాడని, అన్నట్లుగా చేసి చూపించాడని మెచ్చుకున్నాడు.
'2015లో కోహ్లీ నాతో అన్న మాటలు నాకు ఇంకా గుర్తుకున్నాయి. భారత జట్టును టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానంలో పెట్టడమే తన లక్ష్యమని కోహ్లీ అప్పుడు చెప్పాడు. అన్నట్లుగానే చేసి చూపించాడు. జట్టు సత్తా గురించి కోహ్లీకి తెలుసు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా చూడాలనుకున్నాడు. ఈ భూమి మీదే గొప్ప జట్టుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. విదేశాల్లో గెలవడంతో పాటు మంచి బౌలింగ్ లైనప్ కలిగిన తమ జట్టుతో ఎంతటి బలమైన టీమ్‌నైనా మట్టికరిపించే సత్తా ఉందని కోహ్లీ నాతో అన్నాడు'అని క్రికెట్ లైఫ్ స్టోరీస్ అనే యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాన్ డొనాల్డ్ చెప్పుకొచ్చాడు.

ఇక ధోనీ సారథ్యంలో భారత్ 2011-2014 మధ్య 22 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలోనే గెలిచింది. 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. కోహ్లీ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లోనూ టీమిండియా దుమ్మురేపింది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్ట్ సిరీస్ నెగ్గింది. అంతేకాకుండా 42 నెలల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగింది.
తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా కోహ్లీసేన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఫస్ట్ టెస్ట్‌లో వర్షం కారణంగా విజయాన్ని చేజార్చుకున్న భారత్.. రెండో టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకుంది. ఈ విజయ ఉత్సాహంలో లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సన్నదమవుతోంది.
ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రానున్నాడు. లీడ్స్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పు జరగనుంది. అంతేకాకుండా మరో స్పిన్నర్ జడేజా బౌలింగ్ తేలిపోవడంతో అశ్విన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.