భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు వేదికగా బుచ్చి బాబు క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. రంజీ ట్రోఫీ తరహాలోనే నాలుగు రోజుల పాటు జరిగే ఈ రెడ్ బాల్ టోర్నీలో భారత స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగారు. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో.. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సీనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడుతున్నారు.
ఇప్పటి ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం సాధించాడు. దాంతో ఈ టోర్నీపై అందరి దృష్టి నెలకొంది. బుచ్చి బాబు తెలుగు పేరులా ఉండటంతో అతని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎవరీ బుచ్చి బాబు?
బుచ్చి బాబు తెలుగు వ్యక్తే. ఆయన పూర్తి పేరు మోతవరపు వెంకట మహిపతి నాయుడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయనను దక్షిణ భారత క్రికెట్ పితామహుడిగా పిలుస్తారు. 1868లో ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వారి కుటుంబం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేది.
క్రికెట్ అంటే బుచ్చి బాబు నాయుడికి చాలా ఇష్టం. అప్పట్లో క్రికెట్ బ్రిటిషర్ల ఆటగానే ఉండటంతో.. భారత ఆటగాళ్ల పట్ల వివక్ష ఉండేది. బ్రిటిష్ క్రికెటర్లకు సకల సౌకర్యాలు ఉంటే.. భారత ఆటగాళ్లు చెట్టు కిందే భోజనం చేయడం వంటివి చేసేవారు. అది ఆయనకు నచ్చలేదు. దీంతో ప్రత్యేకంగా క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు ఆయన పూనుకున్నారు.
1888 సంవత్సరంలో మద్రాసులోని ఓ మైదానంలో క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్లబ్ నుంచి వచ్చే క్రికెటర్ల సంఖ్య పెరిగింది. ఆటగాళ్లకు దుస్తులు, క్రీడా వస్తువులను బుచ్చిబాబు అందించేవారు. భారత్, బ్రిటిష్ క్రికెటర్ల మధ్య మ్యాచ్ జరగాలనేది ఆయన చిరకాల కోరిక. కానీ ఆయన హఠాన్మరణం తర్వాత ఈ మ్యాచ్ జరిగింది. దాంతో ఆయన స్మారకార్థం ఈ టోర్నమెంట్‌కు బుచ్చి బాబు నాయుడు టోర్నీగా పేరు పెట్టారు.
ఏడేళ్ల తర్వాత..
ఇక అప్పటి నుంచి తమిళనాడు వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. దేశంలో రంజీ ట్రోఫీ వచ్చే వరకు ఇదే అతిపెద్ద క్రికెట్ టోర్నీ గుర్తింపు పొందింది. అనివార్య కారణాలతో గత ఏడేళ్లుగా ఈ టోర్నీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. చివరిసారి జరిగిన టోర్నీ ఫైనల్‌లో ఢిల్లీని మధ్యప్రదేశ్ జట్టు ఓడించి విజేతగా నిలిచింది.
ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలో నిలిచాయి. ఒక్కో గ్రూపులో మూడు జట్ల చొప్పున మొత్తం నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఈ టోర్నీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతోంది. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా ఈ మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు సెమీఫైనల్స్, సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విజేతగా నిలిచిన జట్టుకు రూ.3 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన రూ.2 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది.
బరిలోకి దిగే జట్లు..
గ్రూప్ ఏ: మధ్యప్రదేశ్, జార్ఖండ్, హైదరాబాద్
గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవెన్
గ్రూప్ సి: ముంబై, హర్యానా, టీఎన్‌సీఏ ఎలెవెన్
గ్రూప్ డి: జమ్మూ కశ్మీర్, బరోడా, చత్తీస్‌గఢ్