హైదరాబాద్: ఆకాశ్ మధ్వాల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ఈ ముంబై ఇండియన్స్ యువ పేసర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌తో ముంబైని గెలిపించాడు. 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న 29 ఏళ్ల ఆకాశ్ మధ్వాల్.. 16 ఏళ్ల లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా దూరమైన వేళ.. అసాధారణ బౌలింగ్‌తో ముంబైని గెలిపించిన ఆకాశ్ మధ్వాల్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ప్రాంతానికి చెందిన ఆకాశ్ మధ్వాల్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకు టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. ఇంజనీరింగ్ చదువుకున్న ఆకాశ్ మధ్వాల్.. కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంటి పక్కనే ఉండే ఆకాశ్ మధ్వాల్.. అతని కోచ్ అవతార్ సింగ్ వద్దే శిక్షణ తీసుకున్నాడు.
రిషభ్ పంత్ టీమిండియాకు ఎంపికవ్వడంతో క్రికెట్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన ఆకాశ్ మధ్వాల్.. 2019లో తొలిసారి ముస్తాక్ ఆలీ ట్రోఫి ఆడేందుకు ఉత్తరాఖాండ్ నుంచి ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో ఆకాశ్ మధ్వాల్ ప్రతిభను గుర్తించిన టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మరింత ప్రోత్సహించాడు.
ఉత్తరాఖండ్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్‌లో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆకాశ్ మధ్వాల్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. కానీ అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోవడంతో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. అదే సీజన్‌లో సూర్య గాయపడటంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా ముంబై జట్టులో చేరాడు.

తాజా సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్‌సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతణ్ని వదిలేసుకోగా.. ముంబై ఆడించి ఫలితాన్ని రాబట్టింది.
లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ ఆకాశ్ మధ్వాల్ సత్తా చాటాడు. నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఆకాశ్ మధ్వాల్ ఇదే జోరును కొనసాగిస్తే టీమిండియాలో కూడా చోటు దక్కించుకుంటాడని దిగ్గజ ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసిస్తున్నారు.