ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించారు. అందరూ ఊహించనట్లుగానే భారీ మార్పులు లేకుండా జట్టును ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా కొనసాగనుండగా.. అతనికి శుభ్‌మన్ గిల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు చోటు దక్కగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే రీఎంట్రీ ఇచ్చాడు. అయితే టీమిండియా వెటరన్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2025లో మెరుగైన ప్రదర్శన చేసినా.. అతనికి అవకాశం ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయాన్ని అగార్కర్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అయ్యర్‌కు భారత టీ20 జట్టులో చోటు లేదని, అతని కోసం ఎవర్నీ తప్పించాలని ప్రశ్నించాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదని, తమ తప్పు కూడా లేదన్నాడు. జట్టులోకి 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలమన్నాడు. 'శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లు తప్పని పరిస్థితుల్లో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. యశస్వి జైస్వాల్ అవకాశం కోసం వేచి చూడటం దురదృష్టకరం. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతేకాకుండా అతని వల్ల టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తోంది.
శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కూడా దురదృష్టకరమే. శ్రేయస్ అయ్యర్ కోసం జట్టులో ఎవర్నీ తప్పించాలి? మీరే చెప్పండి? ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదు. అదే సమయంలో మా తప్పు కూడా లేదు. మేం కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలం. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ తన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్