మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్‌లను కొనసాగించడం కష్టమని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలోనే రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించామని స్పష్టం చేశాడు. మెగా టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా..ఆడే వన్డేల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పాడు.
మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత వన్డే, టీ20 జట్లను శనివారం అజిత్ అగార్కర్ ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన వన్డే టీమ్, 16 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 జట్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. వన్డే ఫార్మాట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమిస్తున్నామని చెప్పిన అగార్కర్.. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశామని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నాడు.

'ప్రణాళిక, నిలకడ పరంగా మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు సారథులను కొనసాగించడం కష్టం. ఏదో ఒక దశలో తదుపరి ప్రపంచకప్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వన్డే క్రికెట్ అనేది అన్నిటికంటే తక్కువగా ఆడే ఫార్మాట్. దాంతో తదుపరి కెప్టెన్‌ను సిద్దం చేయడానికి కావాల్సిన సమయం లేదు. వన్డే ప్రపంచకప్ టోర్నీకి మరో రెండేళ్ల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయంలా అనిపిస్తోంది. కానీ ఈ సమయంలో వన్డేల సంఖ్య చాలా తక్కువ. టోర్నీ ముంగిటే కొన్ని మ్యాచ్‌లు ఉండవచ్చు.
వన్డే క్రికెట్ షెడ్యూల్‌పై క్లారిటీ లేదు. ఉదాహరణకు భారత జట్టు మార్చిలో చివరి వన్డే ఆడితే.. అక్టోబర్ 19 వరకు మరో మ్యాచ్ లేదు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఇది తెలియజేస్తోంది. భారత వన్డే జట్టులో కొనసాగేందుకు కావాల్సిన అన్ని ఫార్మాలిటీలను కోహ్లీ, రోహిత్ పూర్తి చేశారు. మేం ఎంచుకున్న ఆటగాళ్ల పేర్లను ఎప్పుడూ నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపిస్తాం. వారు ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్షించి మాకు రిపోర్ట్ ఇస్తారు. 2027 వన్డే ప్రపంచకప్ గురించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితమైన హామీ ఇవ్వడం లేదు.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కాగా.. వన్డే జట్టు నుంచి షమీ, జడేజా, చక్రవర్తీలను తప్పించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగగా.. జస్‌ప్రీత్ బుమ్రాను వన్డే సిరీస్‌కు దూరంగా ఉంచారు. రిషభ్ పంత్‌కు వన్డే, టీ20 జట్టులోనూ చోటు దక్కలేదు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు.
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.