ముంబై: వన్డే ప్రపంచకప్ 2023కు ఫ్రెష్‌గా ఉంచాలనే టీమిండియా స్టార్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు విశ్రాంతి ఇచ్చినట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. సుదీర్ఘ టోర్నీ ఆడాలంటే ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కావాలని చెప్పాడు. అదే సమయంలో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావించామని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ ముందు సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సోమవారం అగార్కర్ ప్రకటించాడు.

ఈ సిరీస్‌కు అనూహ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికవ్వగా.. టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు తొలి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి కల్పించారు. వారితోపాటు కుల్దీప్ యాదవ్‌ను కూడా తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. అయితే, చివరి మ్యాచ్‌కు మాత్రం అందరూ అందుబాటులో ఉంటారని చెప్పారు.
ఆసియాకప్‌లో ఆడిన రెండు మూడు మ్యాచ్‌లకే సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఓ రిపోర్టర్ నిలదీసాడు. 'వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా వివిధ పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడనుంది.
ఇలాంటి సమయంలో జరగనున్న ఆసీస్ మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం అవసరమా..? 'అని అజిత్ అగార్కర్‌ను సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు.

మెగా టోర్నీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అగార్కర్ బదులిచ్చాడు. 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు హార్దిక్ పాండ్యా మాకు చాలా కీలకం. వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆసియా కప్‌లో కావాల్సినంత ప్రాక్టీస్ వారికి దొరికింది. కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు.
దాంతో ఈ నలుగురికి విశ్రాంతి ఇచ్చి జట్టులోని మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్నదే మా ఆలోచన. ఇప్పుడు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకపోతే.. సుదీర్ఘంగా జరగనున్న వరల్డ్ కప్‌లో ఏదొక దశకు చేరుకున్నాక మానసికంగా లేదా శారీరకంగా అలసిపోతారు. అప్పుడు పక్కన పెట్టడం చాలా ఇబ్బందవుతోంది.
అందుకే, ఇలాంటి బ్రేక్ ఇవ్వడం వల్ల తాజాగా మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో వరల్డ్ కప్ బరిలోకి దిగే జట్టు ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో మాత్రం రిజర్వ్ బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.