మూడు ఫార్మాట్లలో ఆడగలిగే సామర్థ్యం ఉండటంతోనే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించిన భారత సెలెక్షన్ కమిటీ.. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ శర్మకు డిప్యూటిగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను సెలెక్టర్లు సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించారు. అతని ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అగార్కర్‌తో పాటు నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.

శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు సోమవారం ఈ ఇద్దరూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పర్యటనకు ఎంపిక చేసిన టీ20, వన్డే జట్లుకు సంబంధించిన వివరాలతో పాటు, భవిష్యత్తు ప్రణాళికలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గంభీర్, అగార్కర్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్సీ చేయడం వెనుక ఉన్న కారణాన్ని అజిత్ అగార్కర్ వెల్లడించాడు.
'మూడు ఫార్మాట్లు ఆడే సామర్థ్యం శుభ్‌మన్ గిల్‌కు ఉందని మేం భావించాం. గతేడాదిగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. దాంతోనే అతన్ని భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దాలని మేం భావించాం. సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకునేలా వైస్ కెప్టెన్సీ అవకాశం ఇచ్చాం. సూర్య, రోహిత్‌లకు డిప్యూటీగా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటాడు.
కెప్టెన్ గాయపడినా.. ఫామ్ కోల్పోయినా.. ఆకస్మాత్తుగా కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే సవాల్‌ను మళ్లీ ఎదుర్కోవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే శుభ్‌మన్ గిల్ తన సారథ్య ప్రతిభను చాటుకున్నాడు. దాంతోనే అతనికి కొంత అనుభవం కావాలని భావించాం. జీవితంలో ఎలాంటి గ్యారంటీలు ఉండవు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతనే సరైనోడనిపించింది.'అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.
శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా.. వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించిన అనుభవం ఉంది. భారత్ గెలిచిన 2018 అండర్ 19 ప్రపంచకప్‌లో పృథ్వీ షాకు శుభ్‌మన్ గిల్ డిప్యూటీగా వ్యవహరించాడు. దేశవాళీ క్రికెట్‌లోనే కెప్టెన్సీ చేశాడు. డియోధర్ ట్రోఫీలోనూ ఓ జట్టుకు సారథ్యం వహించాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో టీమిండియాను అద్భుతంగా నడిపించి 4-1తో సిరీస్ గెలిచాడు.
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో టీమిండియాను నడిపించనున్నాడు. సూర్య.. టీ20లు మాత్రమే ఆడుతాడని అగార్కర్ స్పష్టం చేశాడు. సూర్య ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించి 5 విజయాలు అందించాడు.