గిల్ కాదు.. శ్రీలంక కండిషన్స్ అతనికి బాగా సూటవుతాయి: అజింక్యా రహానే
శ్రీలంక పర్యటనలో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ చెలరేగుతాడని మాజీ బ్యాటర్ అజింక్యా రహానే జోస్యం చెప్పాడు. శ్రీలంక కండిషన్స్ అతని బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతాయని తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
శనివారం గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్‌లో దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. సాయి సుదర్శన్ గాయంతో ఈ పర్యటనకు దూరమవడంతో పడిక్కల్‌కు మార్గం సుగుమమైంది. అంతేకాకుండా వామప్ మ్యాచ్‌లో అతను అద్భుతమైన శతకంతో చెలరేగాడు.

పడిక్కల్‌కు సరిగ్గా సూటవుతాయి..
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన రహానే.. పడిక్కల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ గురించి ఆలోచించకుండా.. టెస్ట్ సిరీస్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. శ్రీలంక జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించాడు.
'శ్రీలంక కండిషన్స్ దేవదత్ పడిక్కల్‌కు సరిగ్గా సరిపోతాయి. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి.. ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఒకసారి క్రీజులో కుదురుకున్న తర్వాత స్పిన్ బౌలింగ్‌ను అతను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్స్‌తో అతని వద్ద పూర్తి స్థాయి బ్యాటింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. అయితే మూడో స్థానంలో ఆడే బ్యాటర్ ముందు చూపుతో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ మూడో స్థానం బ్యాటర్ రాణిస్తే.. జట్టు మొత్తం ఆధిపత్యం చెలాయించగలదు.
స్పిన్నర్లపై చెలరేగుతాడు..
దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతను మంచి రిథమ్‌లో కనిపిస్తున్నాడు. అతను తన ఫామ్, రిథమ్ నమ్ముకొని ఆడాలి. తనపై తాను అనవసర ఒత్తిడి పెంచుకోకుండా ఉండటం ముఖ్యం. అతనికి పరుగులు ఎలా చేయాలో తెలుసు. స్పిన్నర్లపై కట్, స్వీప్, స్టెప్ ఔట్ షాట్స్‌తో ఎదురుదాడి చేయగలడు.'అని రహానే చెప్పుకొచ్చాడు.
తక్కువ అంచనా వేయవద్దు..
భారత్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించి శ్రీలంకను తేలికగా తీసుకోకూడదని రహానే హెచ్చరించాడు. 'డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌ను దృష్టిలో పెట్టుకొని శ్రీలంకను తేలికగా తీసుకోకూడదు. భారత్ ముందుగా తొలి టెస్ట్ గెలవడంపై ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాతే రెండో టెస్టు గెలిచి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం గురించి ఆలోచించాలి.
కీలకమైన క్షణాలను గుర్తించి ఆధిపత్యం చెలాయిస్తేనే సిరీస్ కైవసం అవుతుంది. ఈ సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్ట్‌ల్లో బాగా రాణించాలనే కసితో శ్రీలంక కూడా ఉంది. ఈ సిరీస్ ఏ మాత్రం ఏకపక్షంగా ఉండదని నేను భావిస్తున్నా.'అని అజింక్యా రహానే అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

