అజింక్యా రహానే రిటైర్మెంట్.. తీవ్ర భావోద్వేగం!
టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్యా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన వీడియోను పంచుకున్నాడు. 'ప్రతీదానికీ ఆరంభం.. ముగింపు ఉంటాయనేది జీవిత సత్యం. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని గౌరవించి ముందుకు సాగాలి.
నేను కూడా నా బ్యాటింగ్ సమయంలో టైమింగ్‌నే నమ్ముకునేవాడిని. అలాగే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నా. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇక తప్పుకుంటున్నా..
తదుపరి దశకు వెళ్లేందుకు ఇదే ఉత్తమ సమయం. భారత జట్టు జెర్సీ ధరించాలనే కలను నెరవేర్చుకున్నా. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు, దేశం ముఖ్యమనే నమ్మాను. మన మనస్సు మంచిదైతే ఆటే మనల్ని రక్షిస్తుంది. నిజాయితీగా ఇప్పటి వరకు నా గేమ్ ఆడా. గత 20 ఏళ్లలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి భారత జట్టుకు ఆడే వరకూ ప్రతి క్షణం గర్వంగా ఫీలయ్యా. ఇక ఈ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నా. కానీ ఆటతో మాత్రం కాదు.

తదుపరి తరం కోసం నా వంతు సాయం చేసేందుకు, నా అనుభవాలను పంచుకొనేందుకు తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తా. నా ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు చూశా. ఆటను ఆస్వాదించే విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, సహచరులు, కోచ్‌లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నా కుటుం సభ్యులు, స్నేహితులు, ఇలా నాకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా.
అజింక్యా అంటే ఎవరూ ఓడించలేరని అర్థం. కానీ క్రికెట్‌లో చాలా సార్లు ఓటములను చూశా. క్రికెటర్లుగా విజయాలతో పాటు ఓటములను కూడా అనుభవిస్తాం. చాలా తప్పిదాలు చేసి ఉంటా. కానీ నా మనసులో మాత్రం ఓటమికి చోటు లేదు. ప్రతిసారి విజయం కోసమే బరిలోకి దిగా. క్యాప్ నంబర్ 278కి గుడ్‌బై'అని రహానే ఈ వీడియోలో భావోద్వేగానికి గురయ్యాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా..
ఆస్ట్రేలియాపై 2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియాకు అందించిన కెప్టెన్‌గా రహానే చరిత్రలో నిలిచిపోతాడు. భారత్ తరఫున చివరిసారిగా 2023లో ఆడిన రహానే.. పునరాగమనం కోసం ఎంత ప్రయత్నించినా.. సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఇక తనకు అవకాశాలు రావని భావించే రహానే రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత్ తరఫున రహానే 85 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 5077 పరుగులు చేశాడు. ఇక 90 వన్డేల్లో 2962 పరుగులు చేయగా.. మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీల ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 20 మ్యాచ్‌లు ఆడి 375 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది.ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడి 5367 పరుగులు చేశాడు. అజింక్యా రహానే కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

