భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న రహానే.. గతేడాది వెస్టిండీస్ పర్యటనలో చివరిసారిగా ఆడాడు. ఆ సిరీస్‌లో విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయాడు.
జట్టులో కుర్రాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రహానే భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ రహానేకు చోటు దక్కలేదు. దాంతో అతను దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.

ఆంధ్రాపై విజయానంతరం మాట్లాడిన అతను.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ముంబై తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనర్చడంపై ఫోకస్ పెట్టా. మేం ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాం. ట్రోఫీని గెలవాలంటే టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడాలి. ఇది సవాల్‌తో కూడుకున్న పని.
ఒక్కో మ్యాచ్‌పై ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నాం. రంజీ ట్రోఫీ గెలవడంతో పాటు భారత్ తరఫున 100 టెస్ట్‌లు ఆడటం నా లక్ష్యం'అని రహానే చెప్పుకొచ్చాడు. అజింక్యా రహానే ఇప్పటి వరకు భారత్ తరఫున 85 టెస్ట్‌లు ఆడి 5077 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలతో పాటు 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫీల్డింగ్‌లో 102 క్యాచ్‌లు అందుకున్నాడు. రహానే సారథ్యంలోనే టీమిండియా 2020-21 సీజన్‌లో ఆసీస్ గడ్డపై విజయం సాధించింది.
ఆంధ్రతో మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే గోల్డెన్ డకౌటవ్వగా.. శ్రేయస్ అయ్యర్ 48 పరుగులతో రాణించాడు. అనంతరం ఆంధ్ర 184 రన్స్‌కు ఆలౌటైంది. ఫాలో ఆన్ ఆడించగా.. ఆంధ్ర 244 పరుగులకు కుప్పకూలింది. దాంతో ముంబై ముందు 34 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. వికెట్ నష్టపోకుండా చేధించింది.