
న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే గాడిన పెట్టగలడని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. కోహ్లీ పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థం చేసుకోగలగిన ఏకైక వ్యక్తి సచిన్ మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికారిక బ్రాడ్ కాస్టర్ సోనీ టీవీలో మాట్లాడిన జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లేమిపై సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకోవాలని గతంలో తాను చెప్పిన మాటలను గుర్తు చేశాడు.
'విరాట్ కోహ్లీకి ఫామ్‌కు సంబంధించి చర్చ సందర్భంగా సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎనిమిది నెలల కిందటే నేను చెప్పా. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ సమస్య ఏంటో తెలుసుకోగలిగిన వ్యక్తి. అందుకే విరాట్ కోహ్లీతో కలిసి డిన్నర్ చేయాలని సూచించా. కెరీర్‌ను 14-15 ఏళ్లకే ప్రారంభించిన వ్యక్తి సచిన్. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అందుకే ఇతరుల గురించి నేను ఆలోచించలేదు. సచిన్ మాత్రమే సరైన వ్యక్తి అని నా అభిప్రాయం. వీరిద్దరూ కలవడానికి కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు. అది విరాట్ చేయకపోయినా.. సచిన్ తప్పకుండా ఫోన్ చేసి పిలిపించాలి. ఏదొక సమయంలో యువ క్రీడాకారులు ఇలాంటి దశను (ఫామ్ కోల్పోవడం) అనుభవించక తప్పదు. మనం పెద్దవాళ్లం కాబట్టి అలాంటి యువకులతో చర్చించాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేస్తాడని నమ్ముతున్నా'అని అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు.
ఇక వెస్టిండీస్‌తో సిరీస్‌కు విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే ఉద్దేశంతో సెలక్షన్ కమిటీ పక్కకు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో పర్యటనలోనూ పెద్దగా రాణించలేదు. అందుకే వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి మానసికంగా సిద్ధమయ్యేందుకు విరాట్ కొన్ని రోజులపాటు విరామం తీసుకోవాలని ఇప్పటికే పలువురు మాజీలు సూచించారు.