
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయానికి గురవ్వడం ఏంటో తనకు అర్థం కావడం లేదని మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా అన్నాడు. ఓ బ్యాటర్‌కు బ్యాక్‌పెయిన్ రావడం మొదటిసారి వింటున్నానని, అసలు శ్రేయస్ అయ్యర్ ఏం పనులు చేస్తున్నాడని ప్రశ్నించాడు. వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. సహజంగా ఫాస్ట్ బౌలర్లు వెన్నుగాయానికి గురవుతుంటారు. బౌలింగ్ చేసే సమయంలో వారి వెన్ను ఒత్తిడికి గురవుతుంది కాబట్టి వారు గాయపడటం సహజం. కానీ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయానికి గురవ్వడం ఏంటని అజేయ్ జడేజా ప్రశ్నించాడు.
అప్పుడప్పుడు స్పిన్ బౌలింగ్ చేసే అయ్యర్ వెన్నుపై ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదన్నాడు. జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లు చేయడం వల్లే శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడని ఆరోపించాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ..'గత కొన్ని రోజులుగా శ్రేయస్ అయ్యర్ గాయం గురించి వింటున్నాం. ప్రతీ ఆటగాడికి గాయాలవ్వడం అత్యంత సహజం. అయితే బ్యాటర్లు వెన్నుముక గాయంతో బాధపడుతుండటమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఏ బ్యాటర్ కూడా వెన్ను గాయానికి గురైనట్లు నేను వినలేదు.
అసలు బ్యాటర్ వెన్ను గాయానికి గురవ్వాల్సిన పరిస్థితులే ఉండవు. శ్రేయస్ అయ్యర్ ఆట కంటే బయట చేసే పనుల వల్లనే గాయపడినట్లు అర్థమవుతోంది. జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్లనే అయ్యర్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రతీ ప్లేయర్ కూడా తాను చేసే పనుల వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. వెయిట్ లిఫ్టింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉంటాయి.'అని అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు.
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు మైదానంలో కంటే జిమ్‌లోనే ఎక్కువ గాయపడుతున్నారని తెలిపాడు. అందరూ విరాట్ కోహ్లీని అనుసరిస్తూ అనవసరంగా గాయపడుతున్నారని తెలిపాడు.