
సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలిసారి ఆధిపత్యం చెలాయించిందని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. ఇక సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు రెండు వికెట్లతో 166 పరుగులు చేసింది. లబుషేన్(67 బ్యాటింగ్), పకోస్కీ(62) అర్ధశతకాలతో రాణించారు. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో విఫలమైన స్టీవ్‌స్మిత్(31) ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు.
ఇక బాక్సింగ్ డే టెస్టులో ఓటమిపాలయ్యాక ఆసీస్ బాగా మెరుగైందని, వారి ఆటలోనూ మార్పు కనిపిస్తోందని అజేయ్ జడేజా అన్నాడు. 'బాక్సింగ్ డే ఓటమి తర్వాత ఆసస్ బాగా మెరుగైంది. వారి ఆటలో కూడా మార్పు కనిపిస్తుంది. దూకుడైన బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. వారిని వికెట్లు తీయడానికి మించి ఆలోచించేలా చేశారు. అశ్విన్‌పై ఎదురుదాడికి దిగి డిఫెన్సివ్ మోడ్‌లో పడేలా చేశారు.'అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఇక తొలి రెండు టెస్టులతో పోలిస్తే సిడ్నీ మైదానం మరోలా ఉందని, బౌలర్లకు సహకరించడం లేదని తెలిపాడు. 'క్రెడిట్ మొత్తం మైదాన సిబ్బందికి ఇవ్వాలి. తొలి రెండు మ్యాచ్‌లకు ఈ పిచ్ చాలా భిన్నం. ఆ మ్యాచ్‌ల్లో పిచ్ బౌలర్లకు సహకరించింది.
తొలి రెండు రోజులు వారిదే ఆధిపత్యం నడిచింది. కానీ ఈ మైదానంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బౌలర్లకు ఏమాత్రం సహకారం అందలేదు.'అని తెలిపాడు. ఇక అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న విల్ పకోస్కీ చాలా చక్కగా ఆడాడని, అతడే మాత్రం ఒత్తిడికి గురవలేదని చెప్పాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్‌లా కనిపించాడని కొనియాడాడు.