లక్ష్యాన్ని చేధించాలనే ఒత్తిడే తమ ఓటమిని శాసిచిందని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. టీమిండియాతో శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎయిడెన్ మార్క్‌రమ్.. తమ జట్టు ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఫైనల్లో ఓడినా.. తాము పోరాడిన తీరు గర్వంగా ఉందని చెప్పాడు. ఫైనలిస్ట్‌గా గట్టి పోటీనిచ్చామని తెలిపాడు. 'ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఓటమి నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతోంది. ఫైనల్లో ఓడినా ఈ టోర్నీలో మా జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. తుది పోరులో ఓడినా గర్వంగా ఉంది.

మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. పిచ్ సహకరించకపోయినా.. భారత్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. భారత్ విధించిన లక్ష్యం చేధించిదగినది. మేం బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేశాం.
మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లాం. కానీ విజయలాంఛనాన్ని పూర్తి చేయలేకపోయాం. ఈ టోర్నీలో మేం ఇలాంటి మ్యాచ్‌లు చాలా ఆడాం. ఫైనల్లో మ్యాచ్‌లో మమ్మల్ని స్కోర్ బోర్డ్ ఒత్తిడి వెంటాడింది. దాంతో ఏ దశలోనూ మేం సౌకర్యవంతంగా కనిపించలేదు. ఇదో అద్భుతమైన మ్యాచ్. ఫైనల్ చేరేందుకు మాకు అన్ని అర్హతలున్నాయానే విషయాన్ని ఈ మ్యాచ్ తెలియజేసింది. ఈ ఓటమి భవిష్యత్తులో మా జట్టు మరిన్నీ విజయాలు సాధించేలా చేస్తుందని ఆశిస్తున్నాను'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76), అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 47) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52), క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), ట్రిస్టన్ స్టబ్స్(31) రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్‌దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.