ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని సౌతాఫ్రికా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-డీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కెనడాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ సత్తా చాటగా.. బౌలింగ్‌లో లుంగి ఎంగిడి సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ర్యాన్ రికెల్టన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 39 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) దూకుడుగా ఆడారు. కెనడా బౌలర్లలో అన్ష్ పటేల్(3/31) మూడు వికెట్లు తీయగా.. దిల్‌ప్రీత్ బాజ్వా ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమిపాలైంది. నవ్‌నీత్ ధలివాల్( 49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. హర్ష్ థాకర్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/31) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడా, కార్బిన్ బోష్‌కు చెరో వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. డికాక్, మార్క్‌రమ్ వేగంగా పరుగులు చేశారు. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం డికాక్(25) ఔటైనా.. ర్యాన్ రికెల్టన్‌తో కలిసి మార్క్‌రమ్ చెలరేగాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను డిలన్ హీలింగర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్‌పై హీలింగర్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్(6) విఫలమైనా.. డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ దూకుడుగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు.
భారీ లక్ష్య ఛేదనలో కెనడాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బాజ్వా(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగ్గా.. మరో ఓవపెనర్ యువరాజ్ శర్మ(12) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. నికోలస్ కిర్టన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ ముగ్గురిని లుంగి ఎంగిడే ఔట్ చేశాడు. శ్రేయస్ మొవ్వ(9)ను రబడా క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే కెనడా 4 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో హర్ష్ థాకర్(33)తో కలిసి నవ్‌నీత్ ధలివాల్ జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. హర్ష్ థాకర్ ఔటైనా.. సాద్ బిన్ జఫార్(1) సాయంతో ధలివాల్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాన్సెన్ బౌలింగ్‌లో సాద్ బిన్, జస్కరణ్ సింగ్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ధలివాల్‌కు అండగా మరో బ్యాటర్ రాణించలేదు.