మిడిలార్డర్ వైఫల్యం వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. టాపార్డర్ మెరుగ్గా రాణించినా.. మిడిలార్డర్ ఆ జోరును కొనసాగించలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మార్క్‌రమ్.. టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ తమకు ఎన్నో పాఠాలను నేర్పిందని తెలిపాడు. 'ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నా. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే బ్యాటర్లు సమష్టింగా రాణించాలి. డికాక్‌తో పాటు టాప్ 3 బ్యాటర్లు మాకు అద్భుతమైన ఆరంభం అందించారు. దాంతో మేం గెలుపు రేసులో నిలిచాం. కానీ మిడిల్ ఓవర్లలో ఆ జోరును కొనసాగించలేకపోయాం. మిడిలార్డర్ బ్యాటర్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు.

అయినప్పటికీ ఈ మ్యాచ్ ఎన్నో పాఠాలను నేర్పింది. టీ20 ప్రపంచకప్ ముందు ఈ పాఠాలు మాకు ఎంతో విలువైనవి. ఎందుకంటే ప్రపంచకప్‌లో ఇక్కడే మేం చాలా మ్యాచ్‌లు ఆడనున్నాం. కాబట్టి ఈ అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడనుంది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో బ్రెవిస్ సామర్థ్యాన్ని పరీక్షించాలనుకున్నాం. అతను చాలా సునాయసంగా సిక్సర్లు బాదగలడు. అందుకే అతని అప్‌ది ఆర్డర్ పంపించాం. ఇందులో వ్యూహాత్మక కోణం కూడా ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ద్వారా ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూశాం.
టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు. పరిస్థితులకు తగ్గట్లు అంతరాత్మ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాత్రి మేం అదే చేశాం. మేమే కాదు చాలా జట్లు ఇలానే చేస్తాయి. టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్‌లో మేం కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇది మా మంచికే అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రపంచకప్ గెలవాలంటే మేం చేయాలనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. భారత్ వంటి నాణ్యమైన జట్టుతో ఆడటం మాకు కలిసొచ్చే అంశం. భారత్ అద్భుతంగా ఆడింది. ఈ గెలుపు క్రెడిట్ వారికివ్వాల్సిందే.
ఈ సిరీస్ ద్వారా మా బలహీనతలు, లోపాలను గుర్తించాం. గత రెండు వారాలు మేం నేర్చుకున్న పాఠాలు వెలకట్టలేనివి. ప్రపంచకప్ ముందు మా కాంబినేషన్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సిరీస్ ప్రారంభంలో మేం కొన్ని ప్రయోగాలు చేశాం. విభిన్నమైన కాంబినేషన్లతో పాటు ఆటగాళ్లను వివిధ పాత్రల్లో పరీక్షించాం. ఎవరి ద్వారా అత్యుత్తమ ప్రదర్శన వస్తుందో తెలుసుకున్నాం. ఈ సిరీస్ ద్వారా మాకు చాలా సమాధానాలు దొరికాయి. ప్రపంచకప్ టోర్నీ సమయానికి అన్నీ సెట్ అవుతాయి. ఏం చేసినా ప్రపంచకప్ టైటిల్ గెలవాలనే ఏకైక లక్ష్యంతోనే చేస్తాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) అదిరిపోయే ఆరంభాన్ని అందించగా.. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లిండే తలో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్వింటన్ డికాక్(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(4/53) నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా..అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు.