
హైదరాబాద్: టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, రిషభ్ పంత్ చిన్నప్పటి ఫొటోలు చూశారా? పాల బుగ్గల పసి వయసులో ఈ స్టార్ ఆటగాళ్లు ఎలా ఉండేవారో ఊహించారా? ఇదే ఆలోచనతో ఓ అభిమాని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయంతో టీమిండియా ఆటగాళ్ల చిన్న పిల్లల ఫొటోలను తయారు చేశాడు. ధోనీ, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలతో పాటు ఇతర ఆటగాళ్ల ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గౌరవ్ అగర్వాల్(@7Gaurav8) అనే ట్విటర్ యూజర్ ఏఐ టెక్నాలజీ సాయంతో ఈ ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫొటోల్లో ఉన్న తప్పిదాలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాల బుగ్గల వయసులో క్రికెటర్లకు మీసాలు, గడ్డాలు ఉన్నాయా? అని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ తప్పిదాలను సదరు యూజర్ సవరించే ప్రయత్నం చేశాడు.
ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా కొన్ని జంటలకు సంబంధించిన ఏఐ టెక్నాలజీతో కూడిన వెడ్డింగ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. దాంతో గౌరవ్ టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను ఈ టెక్నాలజీతో రూపొందించి ట్వీట్ చేయగా... ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో అతను మహిళా క్రికెటర్ల ఫొటోలను కూడా షేర్ చేశాడు. భారత ఆటగాళ్ల ఫొటోల్లో రోహిత్ శర్మ ఫొటో చాలా ముద్దుగా ఉంది. ఈ ఫొటోను చూస్తే ఎవరైనా ముద్దివ్వాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలో ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో టీమిండియా ఆటగాళ్ల ఓల్డేజ్ ఫొటోలు షేర్ చేయగా... వీపరీతంగా వైరల్ అయ్యాయి.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరంగా ఉండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు పోటీపడుతోంది. తొలి టీ20లో గెలిచి ఆధిక్యంలో నిలిచిన హార్దిక్ సేన.. రెండో విజయంపై కన్నేసింది.