న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో దూరం కాగా.. టీ20 సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్ వర్మ అందుబాటులో లేకుండా పోయాడు.
తాజాగా తొలి వన్డేలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. రిషభ్ పంత్ తరహాలోనే సైడ్ స్ట్రెయిన్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్.. నొప్పితో మైదానం వీడాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. అనంతరం సుందర్ బ్యాటింగ్ చేయాల్సి రావడంతో బరిలోకి దిగాడు. నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. క్రీజులో పరుగెత్తేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతానికి అయితే సుందర్ గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను బీసీసీఐ వెల్లడించలేదు.

మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. సైడ్ స్ట్రెయిన్ గాయమైందని, స్కానింగ్ తర్వాత గాయం తీవ్రతపై స్పష్టత రానుందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో భాగంగా ఉన్న సుందర్ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. అతని గాయం పెద్దది కావద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ అతని గాయం చిన్నదే అయినా.. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఒకవేళ సుందర్ ఈ సిరీస్‌కు దూరమైతే అతని స్థానంలో షెహ్‌బాజ్ అహ్మద్ జట్టులోకి రానున్నాడు.
తొలి వన్డేకు ముందు రిషభ్ పంత్ కూడా సైడ్ స్ట్రెయిన్ గాయంతోనే జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో బీసీసీఐ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసింది.
పక్కటెముకల దగ్గర ఉండే కండరాల్లో చీలిక రావడం లేదా విపరీతంగా సాగడాన్ని సైడ్ స్ట్రెయిన్ అంటారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే.. ఒక బౌలర్ బంతిని విసిరేటప్పుడు తన శరీరాన్ని ఒకవైపుకు బలంగా వంచినప్పుడు, పక్కటెముకలకు అనుసంధానించిన కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడి సాగడం లేదా, చీలిక రావడం జరుగుతుంది. బ్యాటర్లు కూడా వేగంగా కదిలినప్పుడు పక్కటెముకల కండరాలు పట్టేస్తాయి.
తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడటం, సరైన వామప్ లేకుండా బౌలింగ్, బ్యాటింగ్ చేయడం, అతిగా వంగడం, శరీరాన్ని కదల్చడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సాధారణ గాయం అయితే 2 నుంచి 4 వారాల్లో నమయవుతుంది. కానీ చీలిక వస్తే మాత్రం 6 నుంచి 8 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.