టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సహనం కోల్పోయాడు. ఓ అభిమాని అత్యుత్సాహంతో జస్‌ప్రీత్ బుమ్రాకు కోపం తెప్పించాడు. అనుమతి లేకుండా సెల్ఫీ వీడియో తీయడంతో చికాకు గురైన బుమ్రా అతని ఫోన్ లాగిపడేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బుమ్రాతో పాటు సదరు అభిమానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్‌పోర్ట్‌లో బుమ్రాను చేసిన ఓ అభిమాని అతని అనుమతి లేకుండా సెల్ఫీ వీడియో తీసాడు. ఇది గమనించిన బుమ్రా వద్దని హెచ్చరించాడు. అయినా ఆ అభిమాని పట్టించుకోకుండా సెల్ఫీ తీసాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన బుమ్రా ఫోన్ లాక్కున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేదు. అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బుమ్రాకు అంత కోపం ఎందుకుని కొందరంటే మరికొందరు మాత్రం అభిమానిని తిడుతున్నారు. బుమ్రాను చూసిన ఆ ఆనందంలో సదరు అభిమాని అలా చేశాడని, దానికే అంతా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన సెలెబ్రిటీలతో అభిమానులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చకు దారి తీసింది. ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కొందరు సూచిస్తున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇలానే ఓ అభిమానిని పక్కకు తోసేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అభిమానుల అత్యుత్సాహం కూడా క్రికెటర్లను ఇబ్బంది పెడుతోంది.
సౌతాఫ్రికాతో ఐదో టీ20ల సిరీస్‌లో భాగంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన సంగతి తెలిసిందే. చివరి రెండు టీ20లు ఆడేందుకు జట్టుతో కలిసిన బుమ్రా.. ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం భారత్, సౌతాఫ్రికా మధ్య ఆఖరి టీ20 జరగనుంది.
తొలి మూడు టీ20ల్లో రెండు గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.