
షార్జా: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. స్కాట్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గాన్ 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపిన అఫ్గాన్.. ఆ తర్వాత తమ స్పిన్‌తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్(5/20), రషీద్ ఖాన్(4/9) ధాటికి స్కాట్లాండ్ పట్టుమని 11 ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 190 పరుగులు చేసింది. నజీబుల్లా జడ్రాన్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీ రాణించగా.. హజ్రతుల్లా జాజై(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), రహ్‌మునుల్లా గుర్బాజ్(37 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 46) మెరుపులు మెరిపించారు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ రెండు, మార్క్ వాట్, జోష్ డేవీ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలోనే 60 పరుగులకు ఆలౌటైంది. స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సీ(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) మినహా అంతా విఫలమయ్యారు. స్కాట్లాండ్ టీమ్‌లో నలుగురు బ్యాట్స్‌మన్ డకౌట్‌గా వెనుదిరిగారు. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(5/20) ఐదు వికెట్లతో చెలరేగగా.. రషీద్ ఖాన్(4/9) నాలుగు వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు హజ్రాతుల్లా జజాయి (44), మహమ్మద్ షెహజాద్ (22) జట్టుకు శుభారంభం అందించారు. వేగంగా ఆడే క్రమంలో షెహజాద్ షరీఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మానుల్లా (46)తో కలిసి మరో ఓపెనర్ హజ్రాతుల్లా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే మార్క్ వాట్ వేసిన పదో ఓవర్లో హజ్రాతుల్లా బౌల్డయ్యాడు.
అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన నజీబుల్లా జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ నిలకడగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 19 ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రహ్మానుల్లా క్యాచ్ ఔటై క్రీజు వీడాడు. షరీఫ్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి నజీబుల్లా జద్రాన్ ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్ మహమ్మద్ నబీ (11) నాటౌట్‌గా నిలిచాడు.