అదే మా కొంపముంచింది.. అందువల్లే ఓడిపోయాం: ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ పరాజయం పాలవ్వడంపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. మొదటి మ్యాచ్ లో చేసిన పొరపాట్లను దిద్దుకోవడంలో తమ జట్టు మళ్లీ విఫలమైందని ఆయన ఒప్పుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా భారత్ వంటి ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో పోటీపడుతున్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానంపై జట్టుగా విస్తృతంగా చర్చించినప్పటికీ.. స్టేడియంలో వాటిని అమలు చేయలేకపోయామని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లోనూ పవర్ ప్లే మెరుగ్గా ఆడలేకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని, ఆరంభంలోనే భారత బౌలర్లు తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని చెప్పాడు.
జట్టు సాధించాల్సిన స్కోరు, పవర్ ప్లే వ్యూహాల గురించి డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చలను ఇబ్రహీం జద్రాన్ వెల్లడించాడు. సాధారణంగా నమోదవుతున్న 150-160 స్కోరును 200 ప్లస్ పరుగులకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన ప్రణాళికలు రచించినట్లు పేర్కొన్నాడు. సరైన ఉద్దేశంతో ఆడి పవర్ ప్లేలో 60 పరుగులు సాధించగలిగితే.. 200కి పైగా స్కోరు చేయడం సులభం అవుతుందని భావించామని.. కానీ ఈ వ్యూహాన్ని బ్యాటర్లు సరిగ్గా అమలు చేయలేకపోయారని తెలిపాడు. భారత బౌలర్ల ప్రతిభను అభినందిస్తూనే.. భవిష్యత్తులో ఇలాంటి జట్లను ఓడించాలంటే ఈ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉందన్నాడు.

అయితే తమ జట్టు ఈ ఏడాది ఆడిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ మాత్రమేనని.. తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఓ కారణమైందని ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ.. పవర్ ప్లే వైఫల్యాలను అధిగమిస్తే కచ్చితంగా భారత్ వంటి బలమైన జట్లకు గట్టి పోటీ ఇవ్వగలమని ధీమా వ్యక్తం చేశాడు. త్వరలోనే తమ జట్టు లోపాలను అధిగమించి మరింత బలంగా పుంజుకుంటుందని ఆఫ్ఘన్ కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


