AFG vs SA: వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శనతో సంచలన విజయాలు అందుకున్న అఫ్గానిస్థాన్.. చివరకు ఓటమితో టోర్నీని ముగించింది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన సఫారీ టీమ్ సునాయస విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఓమర్జాయ్(107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(4/44) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీసారు.

ఆండిలే పెహ్లుక్వాయో ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. రాసీ వాన్ డెర్ డస్సెన్( 95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. క్వింటన్ డికాక్(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా కీలక సెమీస్ ముందు ఛేజింగ్‌లోనూ సత్తా చాటగలమని చాటి చెప్పింది. మెగా టోర్నీలో సఫారీ టీమ్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేయలేకనే ఓటమిపాలైంది.

క్రికెట్ చరిత్రలోనే అఫ్గానిస్థాన్‌కు ఈ టోర్నీ మెరుగైన ప్రదర్శన. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు నేరుగా అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోర్లాపడింది. ఆ మ్యాచ్ గెలిచి ఉంటే అఫ్గాన్‌కు సెమీస్ చేరే అవకాశాలు రెట్టింపు అయ్యేవి.
ఏది ఏమైనా సంచలన ప్రదర్శనతో అఫ్గాన్ తాము పసికూనలం కాదని ప్రపంచానికి చాటి చెప్పింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఆ జట్టు ఇప్పటి వరకు ఐదు విజయాలే నమోదు చేయగా.. అందులో నాలుగు తాజా టోర్నీలో గెలిచినవే కావడం విశేషం. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను అఫ్గాన్ ఓడించింది.