AFG vs SA, Hashmatullah Shahidi: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీని ఓటమితో ముగించినా.. తమ జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు. టోర్నీ ఆసాంతం జట్టుగా తాము కనబర్చిన పోరాట పటిమ సంతృప్తినిచ్చిందన్నాడు. శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హష్మతుల్లా.. ఈ టోర్నీ ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పాడు. 'ఓ కెప్టెన్‌గా ఈ టోర్నీలో మా జట్టు కనబర్చిన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతీ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు మేం విజయం కోసం పోరాడం. మాకు కొన్ని మంచి విజయాలు కూడా దక్కాయి. మరికొన్ని మ్యాచ్‌లు మా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా గుణపాఠంగా నిలిచాయి.

మా బ్యాటింగ్ విభాగం రాణించిన తీరుకు గర్వపడుతున్నాను. ప్రపంచకప్ ముందు మేం చాలా ఇబ్బంది పడ్డాం. కానీ మెగా టోర్నీకి ముందు మేం మా బలహీనతలపై ఫోకస్ పెట్టి వాటిని అధిగమించే ప్రయత్నం చేశాం. మా బ్యాటర్లు ఆడిన తీరు మా భవిష్యత్తుకు సంకేతం. మా జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారనే విషయం అందరికి తెలుసు.
ఈ ప్రపంచకప్‌లో మా బ్యాటింగ్ విభాగం కనబర్చిన జోరునే కొనసాగిస్తే.. మా జట్టుకు తిరుగుండదు. ప్రపంచానికి మేం ఓ మంచి మెసేజ్ ఇచ్చాం. పెద్ద జట్లతో ఓడినా.. మేం చివరి వరకు పోరాడం. ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ అసాధారణ ప్రదర్శనతో చేజార్చుకున్నాం. మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ ఇప్పటికీ నాకు షాకింగ్‌లానే ఉంది. కానీ ఆ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం.'అని హష్మతుల్లా షాహిదీ చెప్పుకొచ్చాడు.
అఫ్గానిస్థాన్‌కు ఈ టోర్నీ మరిచిపోలేనేది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు నేరుగా అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోర్లాపడింది. ఆ మ్యాచ్ గెలిచి ఉంటే అఫ్గాన్‌కు సెమీస్ చేరే అవకాశాలు రెట్టింపు అయ్యేవి.
ఏది ఏమైనా సంచలన ప్రదర్శనతో అఫ్గాన్ తాము పసికూనలం కాదని ప్రపంచానికి చాటి చెప్పింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఆ జట్టు ఇప్పటి వరకు ఐదు విజయాలే నమోదు చేయగా.. అందులో నాలుగు తాజా టోర్నీలో గెలిచినవే కావడం విశేషం. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను అఫ్గాన్ ఓడించింది.