
కీలక సమయంలో ఔటయ్యాననే అసహనంతో పాకిస్థాన్ బ్యాటర్ అసిఫ్ అలీ హద్దులు ధాటాడు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ బౌలర్‌ను కొట్టబోయాడు. తన బ్యాట్‌తో బౌలర్ తలపగలకొడతానంటూ హెచ్చరించాడు. ఇంతలో అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరిని వారించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. పాకిస్థాన్ క్రికెటర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాక్ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమవ్వగా.. ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో హ్యారీస్ రౌఫ్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగాడు. ఆ తర్వాత అసిఫ్ అలి సిక్సర్ బాది జోరు కనబర్చాడు. కానీ మరుసటి బంతికే అతను క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో ఫరీద్ అహ్మద్ ఆనందం పట్టలేక ఎవో వ్యాఖ్యలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇక ఓటమి భయంతో పాటు కీలక సమయంలో ఔటయ్యాననే అపరాదభావంతో సహనం కోల్పోయిన అసిఫ్ అలీ.. ఆ ఆగ్రహాన్ని బౌలర్‌పై చూపించాడు. అతనిపైకి బ్యాట్ ఎత్తుతూ.. తల పగులుద్ది అంటూ హెచ్చరించాడు. ఇక చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. నసీమ్ షా అనూహ్యంగా రెండు సిక్స్‌లు బాది పాకిస్థాన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓటమితో అఫ్గాన్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35), హజ్రతుల్లా జాజై(17 బంతుల్లో 4 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్‌నైన్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతర లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. ఇఫ్తికర్ అహ్మద్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30), షాదాబ్ ఖాన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. నసీమ్ షా(4 బంతుల్లో 2 సిక్స్‌లతో 14 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్, మూడేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.