
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మరో విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న ఆ జట్టు ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ (23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) తన ఆఖరి మ్యాచ్‌లో అదరగొట్టాడు. అస్గర్‌కు తోడుగా ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), అహ్మద్ షెజాద్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), కెప్టెన్ మహమ్మద్ నబీ (17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్, లాప్టీ ఈటన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జెజె స్మిట్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు మాత్రమే చేసి చిత్తుగా ఓడింది. నమీబియా జట్టులో డేవిడ్ వీస్( 30 బంతుల్లో 2 ఫోర్లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ మూడేసి వికెట్లు తీయగా.. గుల్బాదిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.
ఇక అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని ఆదివారం ప్రకటించిన అస్గర్ అఫ్గాన్.. నమీబియాతో చివరి మ్యాచ్ ఆడి ఘన వీడ్కోలు అందుకున్నాడు. అస్గర్ సూపర్ బ్యాటింగ్ తర్వాత ఔటైన అస్గర్.. మైదానం వీడుతుండగా సహచర ఆటగాళ్లంతా బ్యాట్లను పైకెత్తి గౌరవందనం అందించారు. 16 ఏళ్ల పాటు అఫ్గాన్ తరఫున అస్గర్ ఆడాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇప్పుడే ఎందుకంటే మాత్రం చెప్పలేనన్నాడు.