పునరాగమనంలో డకౌట్‌తో తీవ్రంగా నిరాశపర్చిన విరాట్ కోహ్లీ.. మరో కీలక పోరుకు సిద్దమయ్యాడు. అచ్చొచ్చిన మైదానంలో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ డకౌటయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. అడిలైడ్ వేదికగా గురువారం రెండో వన్డే జరగనుంది.
ఈ సిరీస్‌లో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలి. లేదంటే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోతుంది. అడిలైడ్ వన్డే గెలవాలంటే కోహ్లీతో పాటు రోహిత్ శర్మ రాణించాలి. అయితే అడిలైడ్‌లో కోహ్లీ రికార్డ్స్ బాగున్నాయి. అడిలైడ్ వేదికగా మూడు ఫార్మాట్లలో కలిపి 15 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 65 సగటుతో 975 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 4 శతకాలు ఉన్నాయి.

ఇక్కడ ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడిన కోహ్లీ 61 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దాంతో కోహ్లీ నుంచి మరో సెంచరీ వస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అడిలైడ్ వేదికగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ కొనసాగుతున్నాడు.
975 పరుగులతో అతను టాప్ స్కోరర్‌గా నిలవగా.. సర్ డాన్ బ్రాడ్‌మన్ (970), స్టీవ్ స్మిత్(934), గ్రేగ్ చాపెల్(747), షేన్ వాట్సన్(729), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (687) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్ మినహా మిగతా బ్యాటర్లంతా కోహ్లీ కంటే ఎక్కువ ఇన్నింగ్స్ ఆడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్ వేదికగా చివరిసారిగా ఆడిన కోహ్లీ.. ఈ డే/నైట్ టెస్ట్‌లో తీవ్రంగా నిరాశపర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 7, 11 పరుగులు మాత్రమే చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్‌లకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారింది. ఈ మ్యాచ్‌లో రాణిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గనుంది. లేదంటే విమర్శలు రెట్టింపు అవుతాయి.