ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన అకీల్ ఖాన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అతడి అరెస్ట్‌ను తెలియజేసేలా పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నిందితుడి చేయి, కాలుకు కట్లతో కుంటుతూ కనిపించాడు. దేశం పరువు తీసిన వాడికి పోలీసులు సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా జట్టులోని ఇద్దరు ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇండోర్‌కు వచ్చిన ఆసీస్ టీమ్ ఓ హోటల్‌లో బస చేసింది. హోటల్ నుంచి దగ్గర్లోనే ఉన్న ఓ కేఫ్‌కు ఇద్దరూ మహిళా ఆసీస్ ప్లేయర్లు నడుచుకుంటూ వెళ్తుండగా స్థానికంగా నివసించే అకీల్ ఖాన్ వారిని బైక్ పై వెంబడించాడు.
వారిని అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. వెంటనే ఆ మహిళా క్రికెటర్లు SOS నోటిఫికేషన్ పంపారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారికి రక్షణ కల్పించారు. పోలీసులు వస్తోన్నారనే సమాచారం తెలిసిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమరాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా మహిళా టీమ్ మేనేజర్ డానీ సిమ్మన్స్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 (మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరపూరిత బల ప్రయోగం), సెక్షన్ 78 (వెంబడించడం) కింద ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
క్రికెటర్లపై దాడిని బీసీసీఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ డిమాండ్ చేసింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఈ దాడిని ఖండించాడు. 'భారత్ అంటే అతిథి దేవోభవకు మారు పేరు. ఈ ఘటన గురించి విన్నాక చాలా బాధగా అనిపించింది. ఇది అత్యంత దారుణ ఘటన. ఇక్కడ చట్టం తన పని తాను చేస్తుంది. దోషికి అత్యంత కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. అలా చేస్తేనే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నా.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.