ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ 2024 టీ20 టోర్నీలో భారత్-ఏ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. సోమవారం పసికూన యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ చోప్రా(50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫమయ్యారు. భారత్-ఏ బౌలర్లలో రసిఖ్ సలామ్(3/16) మూడు వికెట్లు తీయగా.. రమణ్‌దీప్ సింగ్(2/7) రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నెహాల్ వధేరా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్-ఏ 10.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభుసిమ్రాన్ సింగ్(8) నిరాశపర్చినా.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అతనికి అండగా... కెప్టెన్, తెలుగు తేజం తిలక్ వర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21) మెరుపులు మెరిపించాడు. ఆయుష్ బదోనీ వరుసగా 6, 4 బాది 51 బంతులు మిగిలి ఉండగానే భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. యూఏఈ బౌలర్లలో విష్ణు సుకుమారన్, ముహమ్మద్ ఫరూఖ్, ఓమిడ్ షెఫీ రెహ్మాన్ తలో వికెట్ తీసారు. పాకిస్థాన్‌తో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే.
వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్-ఏ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గ్రూప్-బీలో ఉన్న భారత్ 4 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ను ఓమన్‌తో బుధవారం ఆడనుంది.