
కాబుల్: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ అన్నారు. ఈ ప్రక్రియ ఎలా జరగుతుందో అనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. తమ దేశం తరఫున మహిళలు క్రికెట్ ఆడాల్సిన పనిలేదని తాలిబన్ నేత అహ్మదుల్లా వసీక్ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
'మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇంకా అవకాశం ఉంది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తామో త్వరలోనే స్పష్టమైన వివరాలు వెల్లడిస్తాం. ఈ ప్రక్రియపై ఓ శుభవార్త బయటకు రానుంది.'అని అజీజుల్లా ఫజ్లీ చెప్పుకొచ్చారు. మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని ఇదివరకే ఆస్ట్రేలియా హెచ్చరించింది. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కూడా టీ20 ప్రపంచకప్ నుంచి అఫ్గాన్‌ను తప్పించాలని పేర్కొన్నాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాను కోరింది.
ఇక తమ రాజ్యంలో మహిళలు ఇస్లాం నిబంధనలకు కట్టుబడి ఉండాలని తాలిబన్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్‌ను నిషేధించారు.
పురుషుల క్రికెట్ జట్టును మాత్రమే ఆడేందుకు అనుమతిస్తామని, మహిళా జట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. ఈ అంశంపై తాలిబన్ కల్చరల్ నేత అహ్మదుల్లా వాసిక్ ఆస్ట్రేలియన్ ఛానల్ ఎస్‌బీఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహిళలు క్రికెట్ ఆడరని, ఇదే కాదు ఏ ఆట కూడా వాళ్లు ఆడబోరన్నారు. మహిళలు క్రికెట్ ఆడాల్సినంత అవసరం లేదన్నారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ముఖం, శరీరం బహిర్గతం అవుతుందని.. ఇస్లాం ప్రకారం మహిళల్ని తాము ఇలా చూడలేమన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్ 3 సంవత్సరాల క్రితమే ఐసీసీ నుంచి పూర్తి సభ్యత్వ హోదా పొందింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అనుమతి వచ్చింది. 2018లో టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. పూర్తి సభ్య దేశాలు పురుషుల బృందంతో పాటు మహిళా క్రికెట్ జట్టును కూడా సిద్ధం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ బోర్డు గత ఏడాది మాత్రమే మహిళా క్రికెట్ జట్టుకు కేంద్ర కాంట్రాక్టును ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత దేశంలో మహిళల క్రికెట్‌లో పలు మార్పులు వచ్చాయి. కానీ తాలిబన్ల ఆదీనంలో ఉన్న అఫ్గాన్ పురుషుల జట్టు టెస్ట్ హోదాను కూడా ఐసీసీ ఉపసంహరించే ముప్పు పొంచి ఉంది.