ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)పై టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్, ఆంధ్ర రంజీ టీమ్ మాజీ కెప్టెన్ హనుమ విహారి చేసిన ఆరోపణలను ఏసీఏ ఖండించింది. హనుమ విహారి ఆరోపించినట్లు అసోసియేషన్‌పై రాజకీయ నాయకుల ప్రభావం లేదని స్పష్టం చేసింది. హనుమ విహారి ఆరోపణలను ఆసరగా చేసుకొని అసోసియేషన్‌కు రాజకీయ రంగు పులమడం సరికాదని స్పష్టం చేసింది.
ఈ మేరకు అంధ్రా క్రికెట్ అసోసియేషన్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హనుమ విహారిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ ప్రకటనకు జత చేసింది.

విహారి ఆరోపణలు అవాస్తవం..
'సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, సహచర ఆటగాళ్లపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని
రాజకీయపక్షాలు ఏసీఏ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడటం చూసి వాస్తవాలను తెలియజేయాలని ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాం. హనుమ విహారి ఏజ్ క్రికెట్ హైదరాబాద్ తరఫున ఆడారు.
2017లో తొలిసారి ఆంధ్రా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. 2020 సీజన్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుంచి విహారి తనకు వస్తున్న ఆఫర్లు నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు.
హనుమ విహారి విజ్ఞప్తులకు పలుమార్లు ఏసీఏ అంగీకరించింది. కానీ ఈసారి ఎన్‌వోసీ ఇవ్వకపోవడం.. భారత జట్టుకు ఎంపిక కాకపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే అసోసియేషన్‌కు వెల్లడిస్తూ.. క్షమాపణలు కూడా కోరాడు. జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకు వచ్చారు.
కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్లు అంతా మద్దతు పలికినట్లు హనుమ విహరి షేర్ చేసిన లేఖ కూడా అవాస్తవం. తమను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నాడని పలువురు ఆటగాళ్లు మా దృష్టికి తీసుకొచ్చారు.
కేఎన్ పృథ్వీ రాజ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌తో జట్టులోకి వచ్చాడని విహారి చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదు. పృథ్వీ రాజ్ రంజీ జట్టులో 17వ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అతను నేరుగా రంజీ టీమ్‌లోకి రాలేదు. అండర్ 14, 16 ఏజ్ గ్రూప్, అండర్-19, వినూ మన్కడ్, కూచ్ బెహార్, అండర్ 23, 25 కల్నల్ సి. కె. నాయుడు ట్రోఫీలో రాణించి ఆంధ్రా రంజీ టీమ్‌కు ఎంపికయ్యాడు.
ఈ సీజన్‌లో బెంగాల్‌తో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా హనుమ విహారి.. కేఎన్ పృథ్వీ రాజ్‌ను ఆడించకుండా గాయపడ్డ మరో వికెట్ కీపర్‌ను ఆడించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా పృథ్వీ రాజ్‌ను విహారి అసభ్య పదజాలంతో దూషించాడు. దాంతో అతను అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా విహారి దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇక సెలెక్షన్ కమిటీ సిఫార్స్ మేరకే హనుమ విహారిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను బీసీసీఐకి అందజేస్తాం.'అని ఏసీఏ తమ ప్రకటనలో పేర్కొంది.