టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. వారి సహకారంతోనే తాను దూకుడుగా ఆడగలుగుతున్నానని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఈ సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ(163) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. 'నేను ఈ సిరీస్ కోసం ఎదురు చూశాను. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నామని తెలిసినప్పుడే నేను చాలా ఉత్సాహానికి గురయ్యాను. ఆస్ట్రేలియా పిచ్‌లు బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుసు. ఈ సిరీస్ మధ్యలో కూడా నాకు ఇదే అభిప్రాయం కలిగింది. మేం ఇంకా భారీ లక్ష్యాలను నమోదు చేయాగలమనిపించింది. హజెల్ వుడ్ వంటి బౌలర్ ఉండటం ఏ జట్టుకైనా ప్రయోజనకరమే. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనితో పోరును నేను ఆస్వాదించాను. గతంలోనే బ్యాటర్లు, బౌలర్ల మధ్య పోరును ఆస్వాదిస్తానని చెప్పాను.

హజెల్ వుడ్ వరల్డ్ క్లాస్ బౌలర్. మంచి క్రికెట్ ఆడాలన్నా.. భవిష్యత్తులో మెరుగ్గా రాణించాలన్నా వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కోవాలి. జట్టు కోసం బాగా ఆడాలంటే ఈ రకమైన బౌలర్లను ఎదుర్కోవాలి. మా కెప్టెన్, కోచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నచ్చినట్లు ఆడమనే స్వేచ్ఛ వారు నాకు ఇచ్చారు. ఒక బ్యాటర్‌గా 20, 30 పరుగులే చేయడం సరికాదు. కానీ, జట్టుకు మూమొంటమ్ సెట్ చేయాలనే బాధ్యతను వారు నాకు ఇచ్చారు. అందుకోసం నేను నెట్స్‌లో, ఆఫ్ సీజన్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. అతిపెద్ద క్రికెట్ టోర్నీ. ప్రపంచకప్ ఆడటం నా కల. చిన్నప్పటి నుంచి ఈ టోర్నీ గురించే కలలు కన్నాను. నా దేశానికి ప్రపంచకప్ అందివ్వాలనుకున్నాను. ఆ టోర్నీకి నేను సిద్దంగా ఉండేలా చూసుకుంటాను.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ 16, 68, 25, 28, 23 నాటౌట్ వరుసగా రాణించాడు.