టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న తాజా ఆసియా కప్ టీ20 టోర్నీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఈ విధ్వంసకర ఓపెనర్ 23 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. అతనికి ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ 309* పరుగులు చేశాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. అంతేకాకుండా ఈ టీ20 టోర్నీలో 300 పరుగులు చేసిన తొలి ప్లేయర్ కూడా అభిషేక్ శర్మనే. ఈ క్రమంలో అతను పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(281) రికార్డ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ(309*), మహమ్మద్ రిజ్వాన్(281), విరాట్ కోహ్లీ(276), ఇబ్రహీమ్ జడ్రాన్(5 ఇన్నింగ్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఒక టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(319) ముందున్నాడు. టీ20 ప్రపంచకప్ 2014లో కోహ్లీ 6 ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేశాడు. ఈ రికార్డ్‌ను అభిషేక్ శర్మ అధిగమించే అవకాశం ఉంది. టీ20 క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ రికార్డ్‌ను అభిషేక్ శర్మ సమం చేశాడు. ఈ ఇద్దరు చెరో 6 సార్లు తక్కువ బంతుల్లో(25 బంతుల్లోపు) హాఫ్ సెంచరీ నమోదు చేశారు.
ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్(7 సార్లు) టాప్‌లో ఉండగా.. రోహిత్, అభిషేక్ శర్మ(6) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20ల్లో వరుసగా అత్యధిక 30 ప్లస్ స్కోర్ నమోదు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మను అభిషేక్ శర్మ సమం చేశాడు. మహమ్మద్ రిజ్వాన్, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ వరుసగా 7 సార్లు 30+ రన్స్ చేశారు.