జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మకు చోటు దక్కింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన అతనికి సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఇక టీమిండియా పిలుపు అందుకోవడంపై అభిషేక్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.
టీమిండియాకు సెలెక్ట్ అయిన వెంటనే శుభ్‌మన్ గిల్ తనకు ఫోన్ చేశాడని తెలిపాడు. తన కంటే ముందే తన తల్లిదండ్రులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసి సంతోషంగా ఫీలయ్యానని చెప్పాడు. 'భారత జట్టుకు ఎంపికవ్వగానే శుభ్‌మన్ గిల్ నాకు కాల్ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది. తొలిసారి టీమిండియాకు ఎంపికవ్వడంతో ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ నేను ఇంటికి వెళ్లేసరికి మా తల్లిదండ్రులు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నారు. అది చూసి చాలా గర్వపడ్డా.

నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన రోజే టీమిండియాకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కష్టపడితే అవకాశం దక్కుతుందని భావించా. అయితే స్వదేశంలోనే అంతర్జాతీయ అరంగేట్ర చేస్తానని అనుకున్నా. కానీ జింబాబ్వే పర్యటనలో అవకాశం వచ్చింది. ఇదో రీయూనియన్‌లా అనిపిస్తోంది.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
అభిషేక్ శర్మతో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌ల్లో 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉండగా.. స్ట్రైక్‌రేట్ 204.22 ఉండటం విశేషం.
జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 జూలై6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 జూలై 14న జరగనుంది.
జింబాబ్వే పర్యటనకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు చేరుకుంది. వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్‌పాండే జింబాబ్వేకు చేరుకోగా.. అమెరికా నుంచి వచ్చిన శుభ్‌మన్ గిల్ జట్టుతో కలిసాడు.
జింబాబ్వేతో తొలి రెండు టీ 20లకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.