న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఘనంగా ప్రారంభించాడు. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (35 బంతుల్లో 5 ఫోర్లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అభిషేక్ శర్మకు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ దూకుడుగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కట్టుదిట్టుంగా బౌలింగ్ చేసిన జాకోబ్ డఫీ తొలి ఓవర్‌లో అభిషేక్ శర్మ సిక్స్ బాదగా.. మరుసటి ఓవర్‌లో సంజూ శాంసన్ రెండు బౌండరీలు బాది అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తొలి బంతిని సూపర్ స్ట్రైట్ డ్రైవ్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. కానీ అతన్ని జాకోబ్ డఫీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ శర్మ చెలరేగాడు. తనకే సాధ్యమైన షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 68 పరుగులు చేసింది. అనంతరం ఈ జోడీ మరింత దూకుడుగా ఆడటంతో 8.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా సాగిన సూర్యకుమార్ యాదవ్(32)ను మిచెల్ సాంట్నర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
సూర్య ఔటైనా.. హార్దిక్ పాండ్యాతో కలిసి అభిషేక్ శర్మ చెలరేగాడు. ఇష్ సోధీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ.. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. హార్దిక్ దూకుడుగా ఆడగా.. శివమ్ దూబే(9) నిరాశపర్చాడు. జెమీసన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా(25)ను జాకోబ్ డఫీ క్యాచ్ ఔట్ చేశాడు.
వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత పరుగుల వేగం కాస్త తగ్గింది. కానీ రింకూ సింగ్ భారీ షాట్లు ఆడటంతో 17.3 ఓవర్లలోనే జట్టు స్కోర్ 200 మార్క్‌ను అందుకుంది. దూకుడుగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్(5) ఔటైనా.. అర్ష్‌దీప్ సింగ్(6 నాటౌట్)తో కలిసి రింకూ సింగ్ చెలరేగాడు. డారిల్ మిచెల్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన రింకూ సింగ్.. మరో రెండు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకున్నాడు.