ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న తమ రెండో మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కడుపు నొప్పితో బాధపడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా. . సంజూ శాంసన్ అవకాశం అందుకున్నాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో సిరాజ్ ఉద్వాసనకు గురయ్యాడు.
ఇక టాస్ గెలిచినా తాను బ్యాటింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ మరో రెండు మ్యాచ్‌లు ఆడడని తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. టాస్ ఓడిపోయి మ్యాచ్ గెలిచినంత కాలం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మంచు ప్రభావం ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో లక్ష్యాలను కాపాడుకున్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
అభిషేక్ ఇంకా కోలుకోలేదు. అతను ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగుతున్నాడు. అతను కూడా అదే తరహా విధ్వంసకర బ్యాటర్. సిరాజ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిచిన నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ పిచ్ కండిషన్స్ నేపథ్యంలో బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన ఫ్లాట్ పిచ్. పిచ్ స్వభావం, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది సరైన నిర్ణయం. మా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపైనే మా దృష్టి అంతా ఉంది. వికెట్ బాగున్నట్లు కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం. మేం క్రికెట్ ఆడేది ప్రేక్షకులను అలరించడానికే. మా జట్టులో రెండు మార్పులు ఉన్నాయి.'అని తెలిపాడు.
భారత్: సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిత్, మలన్ క్రుగర్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ షుల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హెయింగో.